క్రికెట్ అంటే లెక్కలేనన్ని రికార్డులు, చెరిగిపోని ఘనతలు. ఇందులో దిగ్గజ సచిన్ తెందుల్కర్ 100 సెంచరీల నుంచి షోయబ్ అక్తర్ వేగవంతమైన బంతులు వరకు ఉన్నాయి. వీటితో పాటే అబద్ధాలుగా అనిపించే కొన్ని నిజాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటి గురించి ఆసక్తికర విశేషాలు? తదితర విషయాలు కోసం..
ద్రవిడ్ హ్యాట్రిక్ సిక్సులు
తన డిఫెన్స్‌తో బౌలర్లను ముప్పతిప్పలు పెట్టే ద్రవిడ్.. సిక్సులు కొట్టడం చాలా అరుదు. తన కెరీర్లో మొత్తంగా 508 మ్యాచ్‌లు ఆడి, 66 సిక్సులే కొట్టాడంటే దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాంటిది అతడు వరుసగా మూడు సిక్సులు కొట్టి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన తన తొలి ఏకైక టీ20లో జరిగింది.
దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 11 ఓవర్లోని సమిత్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సులు కొట్టి ఆకట్టుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 31 పరుగులు చేసి రాణించాడు. అయితే ఈ పోరులో భారత్‌పై ఇంగ్లీష్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది.
గిల్‌క్రిస్ట్ స్క్వాష్ బాల్ ట్రిక్
2007లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా-శ్రీలంక తలపడ్డాయి. తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్. ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. 104 బంతుల్లో 149 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ప్రత్యర్థి ముందు 38 ఓవర్లలో 281 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది ఆసీస్.
ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ మ్యాచ్‌లో బంతిని బలంగా బాదేందుకు గల ట్రిక్‌ను వెల్లడించాడు గిల్‌క్రిస్ట్. తన ఎడమ చేతి గ్లౌవ్లో ఓ స్క్వాష్ బంతిని పెట్టుకుని ఆడినట్లు, సెంచరీ చేసిన తర్వాత చూపించాడు. ఈ ఆలోచన తన బ్యాటింగ్ కోచ్‌ది అని వెల్లడించాడు. గిల్‌క్రిస్ట్ దంచికొట్టుడుతో లంకపై గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ను ముద్దాడింది.
ఒకే ఓవర్లో 17 బంతులు
2004లో జరిగిన ఆసియాకప్‌లో పాక్ బౌలర్ మహ్మద్ షమి ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏడు వైడ్లు, నాలుగు నోబాల్స్ వేశాడు. దీంతో రెండు ఓవర్లకు 6/1తో ఉన్న బంగ్లా జట్టు.. షమి ఓవర్ తర్వాత 28/1తో నిలిచింది.
పాక్ మాజీ బౌలర్ మహ్మద్ షమి 4 బంతుల్లో 92 పరుగులు
బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్లో ఎక్కువగా మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతుంటాయి!. 2017 మేలో అలాంటి ఓ మ్యాచ్ సందర్భంగా సుజోన్ మహ్మద్ అనే బౌలర్ నాలుగు బంతులు వేసి ఏకంగా 92 పరుగులు సమర్పించాడు. దీనికంటే ముందు 13 వైడ్లు, మూడు నోబాల్స్ వేశాడు. అవన్నీ ఫోర్లు వెళ్లాయి. దీంతో ప్రత్యర్థి జట్టు, 88 పరుగుల లక్ష్యాన్ని కనీసం బ్యాట్ ఉపయోగించకుండా ఛేదించింది.
ఈ మ్యాచ్ తర్వాత సదరు బౌలర్‌పై బంగ్లా క్రికెట్ బోర్డు పదేళ్ల నిషేధం, ఆ జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్లపై తలో ఐదేళ్ల నిషేధం విధించింది.
టెస్టులో ఒకే రోజు నాలుగు ఇన్నింగ్స్‌లు
ఐదురోజుల పాటు జరిగే టెస్టులో ఇరుజట్లు, తలో రెండు ఇన్నింగ్స్‌లు ఆడతాయి. అలాంటిది ఒకేరోజు ఏకంగా నాలుగు ఇన్నింగ్స్‌లు జరగడం విశేషం. 2011 నవంబరులో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా టెస్టు కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా 167.5 ఓవర్లే పడ్డాయి. 214/8తో రెండోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. 284 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆ తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా 96 పరుగులు, కంగారూ బ్యాట్స్‌మెన్ 47 పరుగులకే ఆలౌటయ్యారు. అనంతరం క్రీజులో వచ్చిన సఫారీ బ్యాట్స్‌మన్ గ్రేమ్ స్మిత్, ఆమ్లా.. 81/1తో రెండోరోజును ముగించారు. మూడో రోజు మొదలుపెట్టి 236/2తో ఆసీస్‌పై 8వికెట్ల తేడాతో విజయం సాధించారు.
ఇవీ చదవండి: