మూడు నెలల కరోనా విరామం తర్వాత దక్షిణాఫ్రికాలో క్రికెట్ పునః ప్రారంభం కానుంది. ఈనెల 18 నుంచి జరుగనున్న 3టీ క్రికెట్(3 టీమ్ క్రికెట్) సిరీస్‌తో జెంటిల్మెన్ గేమ్ మళ్లీ మొదలు కానుంది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. నెల్సన్ మండేలా జయంతి రోజున ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఏబీ డివిలియర్స్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.
కరోనా బాధితులకే విరాళం...
సాలిడారిటి కప్ పేరిట నిర్వహిస్తోన్న 3టీ క్రికెట్ సిరీస్ ద్వారా లభించిన మొత్తాన్ని కొవిడ్-19 బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన 24 మంది టాప్ క్రికెటర్లు ఎనిమిది మంది చొప్పున 3 జట్లుగా పోటీపడనున్నారు. తొలుత ఈ టోర్నీని జూన్ 27నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఏర్పాట్లు పూర్తికాకపోవడం వల్ల జూలై 18కి వాయిదా వేశారు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
సాలిడారిటీ కప్ కోసం ఈగల్స్, కింగ్ ఫిషర్స్, కైట్స్.. ఈ మూడు జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్, కింగ్ ఫిషర్స్ జట్టు కెప్టెన్‌గా రబాడా, కైట్స్ టీమ్‌కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్ కెప్టెన్ డికాక్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్ క్రికెట్ అభిమానుల్లో నూతనోత్తేజాన్ని తిరిగి తెస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్.
'3 టీమ్ క్రికెట్' ఫార్మాట్ రూల్స్:
- మూడు జట్లు ఒకే మ్యాచ్‌లో పోటీ పడనున్నాయి. ఒక్కొక్క టీమ్‌లో 8 మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్త 36 ఓవర్లుంటాయి.
- ఒక ఇన్నింగ్స్‌లో ఒక జట్టు మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంది.
- ఒక్కో టీమ్ 12 ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది.
- తొలుత ఎవరు బ్యాటింగ్ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
- ఒక్కో జట్టు బ్యాటింగ్ చేసే 12 ఓవర్లలో.. తొలి 6 ఓవర్లకు ఒక జట్టు, మిగిలిన ఆరు ఓవర్లకు మరో జట్టు ఫీల్డింగ్ చేస్తుంది.
- జట్టులో ఉండే 8 మంది ఆటగాళ్లలో 7 మంది ఔట్ అయితే చివరిగా ఉన్న బ్యాట్స్‌మన్ ఒంటరిగా ఆడవచ్చు. అయితే అతను సరిసంఖ్య పరుగులే చేయాల్సి ఉంటుంది (అంటే 2,4,6 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది).
- అత్యధికంగా ఒక్క బౌలర్ 3 ఓవర్ల వరకు వేయవచ్చు.
- ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. అత్యధిక పరుగులు చేసిన జట్టుకు బంగారాన్ని.. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌కు వెండి.. మిగిలిన చివరి జట్టుకు కాంస్య పతకాలను బహుమతిగా ఇవ్వనున్నారు.