తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​Xన్యూజిలాండ్​: రికార్డుకు అడుగు దూరంలో భారత్​ - kl rahul

న్యూజిలాండ్ గడ్డపై వరుసగా రెండు టీ20ల్లో ఘన విజయాల్ని అందుకున్న భారత జట్టు సిరీస్​పై కన్నేసింది. హామిల్టన్ వేదికగా ఇవాళ మూడో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన గెలిస్తే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంటుంది. మ్యాచ్​ మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలుకానుంది.

3rd T20I: Kohli lead Team India Will Get First T20 Series in Newzeland ?
భారత్​Xన్యూజిలాండ్

By

Published : Jan 29, 2020, 6:17 AM IST

Updated : Feb 28, 2020, 8:44 AM IST

ఈడెన్‌ పార్క్‌లో వరుస విజయాలు సాధించిన టీమిండియా హామిల్టన్​లోని సెడాన్‌ పార్క్‌కు చేరుకుంది. మూడో మ్యాచ్‌ గెలిచి సిరీస్​ను చేక్కించుకోవాలని చూస్తోంది. అదే జరిగితే న్యూజిలాండ్‌ గడ్డపై కోహ్లీసేనకు తొలి టీ20 సిరీస్‌ కైవసం అవుతుంది. సొంతగడ్డపై వరుస పరాభవాలను ఎదుర్కొంటున్న కివీస్‌.. సిరీస్​ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్​ కచ్చితంగా గెలవాల్సిందే. అందుకే విలియమ్సన్​ సేన మ్యాచ్​ నెగ్గేందుకు వ్యూహాలు రచిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్​లు ఓడినప్పటికీ మిగతా మూడింట్లోనూ నెగ్గి భారత్‌కు షాక్‌ ఇవ్వాలని ఎదురుచూస్తోంది. మరి కోహ్లీ, విలియమ్సన్‌లో ఎవరు ఆధిపత్యం వహిస్తారో చూద్దాం..

అబ్బా ముందుది మంచికాలం..

న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ ఇప్పటివరకు టీ20 సిరీస్‌ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచుల సిరీస్‌ 1-2తో చేజారింది. ప్రపంచకప్​కు ముందు ఈ సారి ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతోంది. ఈడెన్‌ పార్క్‌లో రెండు మ్యాచ్​ల్లోనూ విజయ దుందుభి మోగించిన కోహ్లీ సేన.. ఇవాళ జరిగే మూడో పోరులోనూ గెలిస్తే సిరీస్‌ సొంతం అవుతుంది. ఇది టీమిండియాకు ఓ రికార్డు కానుంది. అంతేకాకుండా టీ20ల్లో మెరుగైన ర్యాంక్​ పొందాలనుకుంటోన్న భారత్​కు మరో అవకాశం లభిస్తుంది. సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే ఐసీసీ ర్యాంకుల్లో మరింత మెరుగవ్వొచ్చు. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్​.. సిరీస్​ను క్లీన్​స్వీప్ చేస్తే.. ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.

రో'హిట్​'​ ఇన్నింగ్స్​ కావాలి...

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్​ లైనప్​ చాలా బలంగా ఉంది. గత రెండు మ్యాచ్​ల్లో విఫలమైన రోహిత్​ ఈ మ్యాచ్​లో నిల్చుంటే భారత్​కు విజయం ఖాయమైనట్లే. కేఎల్​ రాహుల్​, కోహ్లీ, శ్రేయస్​, మనీశ్​ పాండేతో జట్టు పటిష్ఠంగా ఉంది. జడేజా ఆల్​రౌండర్​గా సత్తా చాటుతున్నాడు. మరో ఆల్​రౌండర్​ శివమ్​ దూబే బ్యాటింగ్​లో అవకాశం వస్తే నిరూపించుకోవాల్సి ఉంది.

కుల్దీప్​కు ఛాన్స్​ వచ్చేనా..!

మూడో టీ20లో భారత జట్టులో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. చిన్న మైదానం కాబట్టి ఈడెన్‌లో చాహల్‌కు వరుసగా రెండు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు తలపడే సెడాన్‌ పార్క్‌ పెద్ద మైదానం. బౌండరీ సరిహద్దులు సాధారణంగానే ఉంటాయి. అందుకే కుల్దీప్​ యాదవ్‌ను తీసుకోవచ్చు. ఏదేమైనా మణికట్టు ద్వయంలో ఒక్కరికే అవకాశం రానుంది. కుల్‌దీప్‌ ఫ్లైటెడ్‌ డెలివరీలు వేస్తాడు కాబట్టి ఆక్లాండ్‌లో చోటివ్వలేదు.

పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా లయ అందుకొని అదరహో అనిపిస్తున్నాడు. ముఖ్యంగా పవర్​ ప్లే సమయంలో పరుగులు రాకుండా నియంత్రిస్తున్నాడు. మంగళవారం ప్రాక్టీస్​లో కోహ్లీ, రాహుల్‌, చాహల్‌, షమి, బుమ్రా సాధన చేయలేదు. వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్‌ పంత్‌ సాధనను రవిశాస్త్రి, విక్రమ్‌ రాఠోడ్‌ నిశితంగా పరిశీలించారు. అయితే ఈ మ్యాచులో మాత్రం వీరికి అవకాశం కష్టం.

కివీస్​ ఆత్మవిశ్వాసానికి దెబ్బ..

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్‌కు ప్రస్తుత వరుస ఓటములు అవమానంగా మారాయి. బౌలింగ్‌ పరంగా ఆ జట్టులో ఇబ్బందులేమీ లేవు. పేసర్లు, స్పిన్నర్లు చక్కగా బంతులు విసురుతున్నారు. కానీ భారత్‌ బ్యాట్స్‌మెన్‌ వారిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు. బుమ్రా, జడేజా, చాహల్‌, షమి బౌలింగ్‌ ఆడేందుకు ఆతిథ్య ఆటగాళ్లు జంకుతున్నారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంత కష్టంగా ఉందో టిమ్‌ సీఫెర్ట్‌ ఇప్పటికే చెప్పాడు. ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌కు ఇదే చివరి అవకాశం. రెండు మ్యాచుల్లో అతడు 0, 3 పరుగులతో విఫలమయ్యాడు. ఈరోజు మ్యాచ్​లో అతడి స్థానంలో బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్రూస్‌ను తీసుకోవచ్చు.

అచ్చొచ్చిన మైదానం..

ఆక్లాండ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. కానీ సెడాన్‌లో మాత్రం కివీస్‌కు మంచి రికార్డే ఉంది. అక్కడ ఆడిన 9 టీ20ల్లో 7 గెలిచింది బ్లాక్​క్యాప్స్​. ఇదే ఆత్మవిశ్వాసంతో ఆ జట్టు బరిలోకి దిగుతోంది. సెడాన్‌ ఎక్కువగా బ్యాటింగ్​కు అనుకూలం. గతంలో భారీ స్కోర్లూ నమోదయ్యాయి. మైదానం పచ్చికతో కళకళలాడుతుంది. ఇక్కడ 11 టీ20 మ్యాచ్​లు జరగ్గా... ఛేదనలో 5, మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 6 మ్యాచ్​లు గెలిచాయి. అత్యధిక స్కోరు 212/4ను కివీస్‌ నమోదు చేసింది.

భారత్ జట్టు(అంచనా)...

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​శర్మ (వైస్​ కెప్టెన్​), కేఎల్​ రాహుల్(కీపర్​)​, శ్రేయస్​ అయ్యర్​, మనీశ్​​​ పాండే, శివమ్​ దూబే, రవీంద్ర జడేజా, చాహల్​\కుల్దీప్​​, జస్ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమి, శార్దుల్ ఠాకుర్

న్యూజిలాండ్ జట్టు(అంచనా)...

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, గ్రాండ్​హోమ్\టామ్‌ బ్రూస్‌, మార్టిన్ గప్తిల్, కొలిన్ మన్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోదీ, టిమ్ సౌతీ

Last Updated : Feb 28, 2020, 8:44 AM IST

ABOUT THE AUTHOR

...view details