దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక వరుస సిరీస్‌ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లు చూసి విసుగు చెందిన అభిమానులు.. అసలైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో సిరీస్ అనగానే ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగిన టీమిండియా .. ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లోనే ఘోరాపరాభవం మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 0-1తేడాతో వెనుకంజలో ఉన్న భారత్.. రెండో వన్డేలోనైనా విజృంభించాలని భావిస్తోంది. రాజ్‌కోట్ వేదికగా ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
వెనుకడుగేసి.. ముందుకు దూకడం అలవాటే..
అవమానం మూటగట్టుకున్న వెంటనే ఆత్మపరిశీలన చేసుకోవడం టీమిండియాకు అలవాటే. స్వదేశంలో ఐదుసార్లు మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉన్న సమయంలో.. భారత్ పుంజుకొని నాలుగు సిరీస్‌లు గెలిచింది. ఈ మధ్యే వెస్టిండీస్‌పై, 2017లో శ్రీలంక, న్యూజిలాండ్‌పై, 1981-82లో ఇంగ్లాండ్‌పై అలాగే విజయాలు అందుకుంది. ఈ వారసత్వం కోహ్లీసేనకు ఆత్మవిశ్వాసం అందించేదే.
కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు..
తొలి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జట్టుకు చేటు చేసిందనే చెప్పాలి. మూడో స్థానంలో ఆడుతున్న విరాట్ నాలుగులో బ్యాటింగ్‌కు రావడంపై పలువురు మాజీలు విమర్శించారు. అయితే నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్‌కు అవకాశం కల్పించాలనే సదుద్దేశంతోనే కోహ్లీ తన స్థానాన్ని త్యాగం చేశాడు. గబ్బర్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి రావడం వల్ల ఈ తలనొప్పి మొదలైంది. అయితే వాంఖడేలో తన స్థానం మార్పు చేయడం విఫలమైన నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.