అభిమానులకు అతడు ఆరాధ్య దైవం. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో వేల పరుగులు. లెక్కకట్టలేని రికార్డులు. క్రికెట్ చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలు. అతడి ఆట కోసమే మైదానానికి వచ్చేవాళ్లు, టీవీలకు అతుక్కుపోయేవాళ్లు కోకొల్లలు. అతడి విధ్వంస ఇన్నింగ్స్‌లు ప్రత్యర్థులకు పీడ కలలు. ఏ ఆటగాడు సాధించలేని శతక శతకాలు అతడి సొంతం. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇదంతా క్రికెట్ దిగ్గజం సచిన్ రమేశ్ తెందూల్కర్ గురించే అని. సచిన్ సాధించిన రికార్డులు చెప్పుకుంటూ పోతే ఓ రోజు సరిపోదంటే అతియోశక్తి కాదు. 2010లో దక్షిణాఫ్రికాపై అతడు చేసిన ద్విశతకం క్రికెట్ ప్రపంచాన్నే ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. అది సరిగ్గా ఈరోజే.
2010, ఫిబ్రవరి 24.. ఈ తేదీకి భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన పేజీ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్.. వన్డేల్లో డబుల్ సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రోజది.
ఈ మ్యాచ్‌లో 147 బంతులు ఎదుర్కొన్న మాస్టర్ 25 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సచిన్ ఖాతాలో డబుల్ సెంచరీ పడాలని కోరుకున్న అభిమానులు ఉప్పొంగిపోయారు.