వచ్చే ఏడాది మహిళా దినోత్సవం ముందు రోజున రెండు జట్లు ప్రపంచకప్ కోసం తలపడనున్నాయి. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మార్చి 7న జరగనుంది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ హగ్లే ఓవల్ మైదానంలో ఈ టైటిల్ పోరు జరగనుంది. గురువారం ఈ మేరకు తేదీ, వేదిక ప్రకటించింది ఐసీసీ.
2021 ప్రపంచకప్ ఫైనల్ ఎక్కడో తెలుసా..? - 2021 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్
న్యూజిలాండ్ వేదికగా 2021లో మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటివరకు ఈ మెగాటోర్నీ ఫైనల్ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనేది సందిగ్ధంగా మారింది. తాజాగా టైటిల్ పోరు జరిగే వేదికపై స్పష్టత ఇచ్చింది ఐసీసీ. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తుందని వెల్లడించింది.
ఈ 50 ఓవర్ల సంగ్రామం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు జరగనుంది. మొత్తం ఆరు నగరాల్లోని మైదానాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఘనంగా టోర్నీ ఆరంభం కానుంది. ఆ తర్వాత వెల్లింగ్టన్, హామిల్టన్, టౌరంగ, డునెడిన్, క్రైస్ట్‌చర్చ్ వేదికలపై మ్యాచ్‌లు జరగనున్నాయి. 1982లో తొలిసారి మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చింది క్రైస్ట్‌చర్చ్. ఆ తర్వాత 1973, 1978 ఎడిషన్లలో లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఇక్కడ జరిగాయి. తాజా నిర్ణయంతో రెండోసారి ప్రపంచకప్ తుది పోరుకు వేదికైంది.
ఈ మైదాన సామర్థ్యం 20 వేలు. మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఫైనల్‌ను డే/నైట్ రూపంలో నిర్వహించనున్నారు. ఈ మెగాటోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి.