మహిళల క్రికెట్ అంటేనే ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. ఆ మ్యాచ్‌లు జరుగుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ఒక విదేశీ జట్టు వచ్చిందంటే స్పాన్సర్ కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి. అప్పుడప్పుడు అంజుమ్ చోప్రా పేరు వినపడేది. ఆ తర్వాత మిథాలీరాజ్ కనపడటం మొదలైంది. ఎప్పుడైతే మహిళల క్రికెట్ బీసీసీఐలో విలీనమైందో వారి దశ తిరిగింది. కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోయాయి. విదేశీ పర్యటనలు పెరిగాయి. పత్రికలు, మీడియాలో వార్తలు వచ్చాయి. ఆపై ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. ఇప్పుడు వేద కృష్ణమూర్తి, జూలన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్ యాదవ్, షెఫాలీ వర్మ, రాజేశ్వరీ గైక్వాడ్, అరుంధతీ రెడ్డి వంటి క్రికెటర్లు అందరికీ పరిచయం అయ్యారు. ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో వారి ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను మెప్పించడమే కాకుండా.. జట్టును ఫైనల్‌కు చేర్చడానికి కృషి చేశారు. 2020, మార్చి 8న తుదిపోరులో ఓడిన భారత మహిళల జట్టు కోసం అభిమానులు భావోద్వేగానికి గురయ్యి.. కన్నీరు కార్చారు. ఎన్నెన్నో అనుభూతులను పంచిన ఆ ప్రపంచకప్ గురించి మరొక్కసారి నెమరేసుకుందాం.
ఫైనల్ వరకు జైత్రయాత్ర
ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ టీ20 ప్రపంచకప్ జరిగింది. పది జట్లు రెండు బృందాలుగా తలపడ్డాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కఠిన ప్రత్యర్థులున్న గ్రూప్-ఏలో భారత జట్టుకు చోటు లభించింది. దాంతో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరడం కష్టమే అనుకున్నారు. అలాంటిది మిగిలిన నాలుగు జట్లను చిత్తుచేసి 8 పాయింట్లు, +0.979 రన్‌రేట్‌తో సంచలనం సృష్టించింది హర్మన్ సేన. తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య ఆస్ట్రేలియాకు మర్చిపోలేని షాకిచ్చింది. 132 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని 17 పరుగుల తేడాతో విజయబావుటా ఎగరేసింది.
రెండో మ్యాచ్‌లో బంగ్లాను 18 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు 3 పరుగుల తేడాతో ఓటమి రుచి చూపించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం వల్ల నేరుగా ఫైనల్‌కు చేరుకుంది.
ఫైనల్లో కన్నీరు
అనుకున్న రోజు రానేవచ్చింది. ఒకవైపు ఓటమెరుగని భారత్. మరోవైపు హర్మన్‌సేన చేతిలో తొలి మ్యాచ్‌లో దెబ్బతిన్న ఆస్ట్రేలియా. ఫైనల్లో ఫేవరెట్ ఎవరో చెప్పలేని పరిస్థితి. ఆసీస్ వైపు అనుభవం ఉంటే టీమ్‌ఇండియా వైపు ఆశలున్నాయి. ఇక చారిత్రక మెల్‌బోర్న్ దాదాపుగా లక్షమందితో నిండిపోయింది. భారతీయ అభిమానులంతా టీవీ తెరలకు అతుక్కుపోయారు. సచిన్, గంగూలీ, గావస్కర్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు భారత జట్టు గెలవాలని శుభాకాంక్షలు తెలిపారు. టాస్ అదృష్టం ఆతిథ్య జట్టునే వరించింది. అయితే ఆ జట్టు ఓపెనర్లు అలీసా హేలీ (75; 39 బంతుల్లో 7×4, 5×6), బెత్‌మూనీ (78*; 54 బంతుల్లో 10×4) చుక్కలు చూపించారు. మొదటి మ్యాచ్‌లో భయపడ్డ పూనమ్ బౌలింగ్‌ను అత్యంత తెలివిగా ఎదుర్కొన్నారు. స్వీప్ షాట్లతో రాణించి తొలి వికెట్‌కు 115 పరుగులు చేశారు. ఫలితంగా టీమ్‌ఇండియాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది.