తెలంగాణ

telangana

ETV Bharat / sports

2020: టాప్​లో కోహ్లీ.. కరోనాను దాటేసిన ఐపీఎల్​ - 2020 SPORTS ROUND UP

ఇన్​స్టాలో ఈ ఏడాది టాప్‌ 1000 ఇన్‌ఫ్లూయెన్సర్‌ల జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు కోహ్లీ. అలానే గూగుల్ సెర్చ్​లో కరోనాను వెనక్కు నెట్టిన ఐపీఎల్​లో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది.

2020 SPORTS ROUND UP.. KOHLI IPL TOP THE LIST
2020: టాప్​లో కోహ్లీ.. కరోనాను దాటేసిన ఐపీఎల్​

By

Published : Dec 27, 2020, 11:40 AM IST

గూగుల్‌... ప్రపంచంలో ఎక్కడ ఏమున్నా ఎవరికి ఏం కావాలన్నా దీన్లో ఒక్కమాట టైప్‌ చేస్తే చాలు... చిటికెలో సమాచారం మొత్తాన్నీ మన ముందుంచుతుంది. యూట్యూబ్‌... వినోదానికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికీ దీన్ని కేరాఫ్‌ అడ్రెస్‌ అనే చెప్పాలి. ఇక, ట్విటర్‌, ఇన్‌స్టాలో ఒకటి సూటిగా సుత్తిలేకుండా బుల్లిసందేశాలతో పెద్ద విషయాలను చేరవేస్తే, రెండోది... ఫొటోలతో అన్ని విషయాలనూ కళ్లకు కట్టేస్తుంది. మరి, 2020లో భారతీయుల ఆసక్తులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నాలుగింటిలో ఏమేం ఎక్కువగా వెతికారో ఏవి జనానికి తెగ నచ్చేశాయో చూడకపోతే ఎలా?

ఇన్​స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌ జాబితాలో కోహ్లీ అగ్రస్థానం

కోహ్లీదే పైచెయ్యి!

ఆటతోనూ వ్యక్తిత్వపరంగానూ ఆకట్టుకునే విరాట్‌ కోహ్లీని క్రికెట్‌ను పెద్దగా చూడనివాళ్లు కూడా ఇష్టపడతారు. కాబట్టే, క్లాన్‌కనెక్ట్‌. ఏఐ సంస్థ 2020 సంవత్సరానికిగానూ విడుదల చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ టాప్‌ 1000 ఇన్‌ఫ్లూయెన్సర్‌ల జాబితాలో తొలిస్థానంలో నిలిచాడు కోహ్లీ. అతడి ఇన్‌స్టా ఖాతాను 8.37 కోట్లమంది అనుసరిస్తున్నారట మరి. 'సాహో' సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకూ పరిచయమైన హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌ 5.72 కోట్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉంది. మగవాళ్లలో భారత్‌లో టాప్‌ 5 ప్రభావశీలవ్యక్తుల జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో 5కోట్లమంది ఫాలోవర్లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిలిచారు. ఆ తర్వాత బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఉన్నారు. అమ్మాయిల్లో శ్రద్ధాకపూర్‌ తర్వాత దీపికాపదుకొణె(ఫాలోవర్లు5.24కోట్లు), ఆలియాభట్‌, నేహాకక్కర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిలిచారు. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఎక్కువమంది ఫాలోవర్లు కోహ్లీకి ఉన్నా ఇన్‌స్టాలో అత్యధిక ఎంగేజ్‌మెంట్‌ రేట్‌(తరచూ వారి ఖాతాను చూడటం) మాత్రం ధోనీకీ(10.98%), కోహ్లీ భార్య అనుష్కా శర్మకే(6.7%)ఉందట. దీన్లో అనుష్క మోదీని కూడా దాటేసింది.

అందరి చూపూ ఐపీఎల్‌పైనే!

మనవాళ్లకు క్రికెట్‌ మీదున్న ప్రేమ అంతా ఇంతా కాదు. అలాంటిది కరోనా ప్రభావంతో ఈ ఏడాది దాదాపుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్నీ రద్దయిపోయాయి. ఎట్టకేలకు సంవత్సరం చివరిలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభమైంది. దాంతో క్రికెట్‌ ప్రేమికులందరికీ పండుగైపోయింది. అందుకే, ప్రపంచాన్ని వణికించిన కరోనాను కూడా రెండో స్థానంలోకి నెట్టి ‘ఐపీఎల్‌’ ఈ ఏడాది భారతీయుల గూగుల్‌ వెతుకులాటల్లో మొదటి స్థానంలో నిలిచింది. అత్యధికంగా వెతికిన వార్తలూ, క్రీడా వార్తల్లో కూడా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముందుండడం విశేషం.

గూగుల్​లో ఐపీఎల్​ కోసం తెగ వెతికిన నెటిజన్లు

అన్నిరంగాల్లో టాప్‌ 5లో వెతికినవి:

1.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, 2.కరోనా వైరస్‌, 3.అమెరికా ఎన్నికల ఫలితాలు, 4.ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, 5.బిహార్‌ ఎన్నికల ఫలితాలు

ఎక్కువగా అన్వేషించిన వార్తలు:

1.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, 2.కరోనా వైరస్‌, 3.అమెరికా అధ్యక్ష ఎన్నికలు, 4.నిర్భయ కేస్‌, 5.బీరుట్‌ విస్ఫోటనం

ABOUT THE AUTHOR

...view details