మే30న ప్రపంచకప్ ప్రారంభంకాబోతుంది. ఇంగ్లండ్, వేల్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో పేస్ బౌలర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ప్రతి జట్టు తమ అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. 2019 ప్రపంచకప్‌లో ప్రధాన జట్ల బౌలింగ్ విభాగాల రేటింగ్ ఎలా ఉందో చూద్దాం..
భారత్ (8/10)
- స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చాహల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. జడేజా రూపంలో మరో స్పిన్నర్‌తో ఈ విభాగం పటిష్ఠంగా కనబడుతోంది. అలాగే టీమిండియా ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రాతో పాటు అనుభవజ్ఞులైన బుమ్రా, షమీ ఉండనే ఉన్నారు. నాలుగో పేసర్‌గా హార్దిక్ పాండ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బౌలింగ్‌లో బలంగానే కనిపిస్తున్నా ఫిట్నెస్ ప్రధాన పాత్ర పోషించనుంది.
ఇంగ్లండ్ (9/10)
- వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్లంకెట్, టామ్ కరన్, మార్క్ వుడ్ సత్తా చాటేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్‌లాంటి ఆల్‌రౌండర్లతో భీకరంగా కనపడుతోంది ఇంగ్లిష్ సేన. స్పిన్ విభాగంలో రషీద్, మొయిన్ అలీ కీలకపాత్ర పోషించనున్నారు.
ఆస్ట్రేలియా (8/10)
- బలమైన బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతోంది కంగారూ జట్టు. ఐదుగురు ప్రధాన పేసర్లు ఉన్నారు. మిచెల్ స్టార్క్ లీడ్ రోల్లో కమిన్స్, జాసన్ బెహ్రాండార్ఫ్, నాథన్ కౌల్టర్‌నీల్, కేన్ రిచర్డ్సన్ తమ ప్రతిభను చాటుకునేందుకు శ్రమిస్తున్నారు. జట్టుకు అదనపు బలంగా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఉండనే ఉన్నాడు. జంపా, నాథన్ లియోన్‌లతో పాటు ఆల్‌రౌండర్ మాక్స్వెల్ స్పిన్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.