భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 71.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 216 రన్స్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(11), బ్లండెల్(30) పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ భారత బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్నారు. కేన్ టెస్టు కెరీర్లో మరో అర్ధశతకం సాధించాడు. 153 బంతుల్లో 89 రన్స్ సాధించాడు. కివీస్ సీనియర్ ప్లేయర్ టేలర్ తన 100వ టెస్టు మ్యాచ్‌లో.. 44 రన్స్ చేశాడు. వీరిద్దరూ ఔటయ్యాక నికోలస్(17) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. వాట్లింగ్(14*), గ్రాండ్‌హోమ్(4*) క్రీజులో ఉన్నారు.
కుప్పకూలిన భారత లైనప్..
వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై జేమిసన్ (4/39), టిమ్ సౌథీ (4/49) చెలరేగారు. వీరిద్దరి ధాటికి భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 165 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 122/5తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ గంటలోపే ఆలౌటైంది. 43 పరుగులే జోడించి ఆఖరి అయిదు వికెట్లు కోల్పోయింది.
పంత్ రనౌట్ మార్చేసింది..!
రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రహానె (46), పంత్ (19) మధ్య సమన్వయం లోపించడం వల్ల ఆదిలోనే వికెట్ కోల్పోయింది టీమిండియా. పంత్ అనూహ్యంగా రనౌటయ్యాడు. అజాజ్ పటేల్ వేసిన త్రో నేరుగా వికెట్లకు తాకడం వల్ల పంత్ నిష్ర్కమించాడు. అప్పట్నుంచి ఇన్నింగ్స్ రూపు మారిపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్.. సౌథీ వేసిన తొలి బంతికే బౌల్డయ్యాడు. అనంతరం రహానె, ఇషాంత్ శర్మ (5) కూడా పెవిలియన్ బాట పట్టారు. అయితే ఆఖర్లో మహ్మద్ షమి (20) కాస్త బ్యాటు ఝళిపించడం వల్ల భారత్ 165 పరుగులు చేయగలిగింది.