తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీసేన ఖాతాలో అరుదైన రికార్డు.. - india vs bangladesh, pink ball test, day night test, umesh yadav, ishant sharma, shortest test match india, india test record, eden gardens

బంగ్లాదేశ్​తో జరిగిన గులాబి బంతి టెస్టులో.. టీమిండియా బ్యాటింగ్​, బౌలింగ్​లో ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్​ కైవసం చేసుకుంది.రెండు టెస్టుల సిరీస్​ను​ 2-0 తేడాతో క్లీన్​స్వీప్​ చేసింది. అతి తక్కువ బంతుల్లో ముగించిన టెస్టుగా చరిత్ర సృష్టించింది.

ఈ ఏడాది ఒక్క టెస్టు మ్యాచ్​ ఓడిపోని కోహ్లీసేన

By

Published : Nov 25, 2019, 9:21 AM IST

ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రక డేనైట్‌ టెస్టులో.. భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల పేస్​ ధాటికి ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను... ఉమేశ్‌ యాదవ్‌ 5, ఇషాంత్‌ 4 వికెట్లు తీసి ముగించారు. అయితే ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్​లో అసలు ఓటమే ఎరగని జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.

ఆఖరి టెస్టు ఇదే...

బంగ్లా జట్టు మూడో రోజు ఆటను ప్రారంభించగా... 47 నిముషాల్లోనే మ్యాచ్​ను ముగించేశారు భారత బౌలర్లు. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్​ను 2-0తో క్లీన్​స్వీప్​ చేసింది కోహ్లీసేన. ఈ టెస్టు విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది భారత జట్టు. వచ్చే నెలలో విండీస్​తో టీ20, వన్డే సిరీస్​లు మాత్రమే ఆడనుంది టీమిండియా.

తక్కువ బంతులు...

భారత గడ్డపై జరిగిన టెస్టుల్లో... అతి తక్కువ బంతుల్లోనే(968)ముగిసిన మ్యాచ్​ ఇదే. 2018లో అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి టెస్టును భారత్​తో ఆడింది. ఈ మ్యాచ్​ 1028 బంతుల్లో పూర్తయింది. అఫ్గాన్​తో మ్యాచ్​ రెండు రోజుల్లోనే ముగిసినా.. 171.2 ఓవర్లు మ్యాచ్​ జరిగింది. కానీ బంగ్లా ఆట మూడో రోజు వరకు వెళ్లినా.. 161.2 ఓవర్లు మాత్రమే ఆడారు.

పేసర్ల ఆధిపత్యం...

ఈ మ్యాచ్​లో పేసర్లు 19 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. స్పిన్నర్లు వికెట్లేమీ తీయకుండా టెస్టు విజయం సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2018లో జోహన్స్​బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై మ్యాచ్​ ఒకటి కాగా.. ప్రస్తుతం కోల్​కతా వేదికగా జరిగిన డేనైట్ టెస్టు రెండోది. 2017-18లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లోనూ టీమిండియా స్పిన్నర్లు వికెట్లేమి తీయలేదు. అయితే ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సొంతగడ్డపై ఇలా జరగడం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్​లో ఇషాంత్​(9), ఉమేశ్​ యాదవ్​(8), మహ్మద్​ షమీ(2) వికెట్లు సాధించారు. ఇప్పటివరకు పేసర్లు ఎప్పుడూ 19 మందిని ఔట్​ చేయలేదు. 2017లో ఈడెన్​ వేదికగా జరిగిన మ్యాచ్​లోనే పేస్​ బౌలర్లు తీసిన 17 వికెట్లు ఇప్పటివరకు అత్యధికం.

గెలుపు బాట...

2019లో జరిగిన అన్ని టెస్టులు గెలిచి మరో ఘనత సాధించింది టీమిండియా. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్​లో ఓటమే లేకుండా కొనసాగింది. ఇప్పటివరకు 8 మ్యాచ్​లు ఆడగా 7 విజయాలు, ఒకటి డ్రా అయ్యాయి. ఈ ఏడాది ఆరంభంలో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన భారత్​ ఆ సిరీస్​ను డ్రా చేసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్​(2-0), దక్షిణాఫ్రికా(3-0), బంగ్లాదేశ్​(2-0) లపై విజయాలు సాధించింది.

ఇన్నింగ్స్​ తేడాతో...

వరుసగా నాలుగు మ్యాచ్​లు ఇన్నింగ్స్​ తేడాతో గెలిచిన జట్టుగా భారత్​ రికార్డు సృష్టించింది.

  1. దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్​ 137 పరుగుల తేడాతో విజయం
  2. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్​ 202 పరుగుల తేడాతో గెలుపు
  3. బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్​ 130 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా.
  4. ప్రస్తుతం జరిగిన డేనైట్ టెస్టులోనూ ఇన్నింగ్స్​ 46 పరుగుల తేడాతో విజయం.

తొలిసారి డేనైట్ టెస్టు ఆడిన టీమిండియా.. బంగ్లాపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి ఇన్నింగ్స్​లో బంగ్లాదేశ్​ 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బరిలో దిగిన టీమిండియా 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(136; 194 బంతుల్లో, 18 ఫోర్లు).. కెరీర్​లో 27వ సెంచరీ నమోదు చేశాడు. పుజారా(55), రహానే(51) అర్ధశతకాలతో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్​లో బంగ్లా జట్టు 195 పరుగులకే ఆలౌటైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details