తెలంగాణ

telangana

ETV Bharat / sports

నువ్వా-నేనా: ప్రతీకారంతో టీమిండియా.. పట్టుదలతో ఆస్ట్రేలియా

నేటి నుంచి భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ ముంబయి వాంఖడే వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. విజయమే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.

ప్రతీకారంతో టీమిండియా.. ప్రణాళికతో ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే

By

Published : Jan 14, 2020, 5:31 AM IST

కొత్త ఏడాదిలో శ్రీలంక సిరీస్​తో బోణీ కొట్టింది టీమిండియా. ఇప్పుడు పటిష్ఠమైన ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్​ల సిరీస్‌లో భాగంగా మొదటిది, ఈ రోజు ముంబయి వాంఖడే మైదానంలో జరగనుంది. ఇందులో గెలిచి శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది.

పటిష్ఠమైన బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు మరోసారి ప్రధాన బలంగా మారనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉండడం.. కేఎల్ రాహుల్‌ నిలకడగా రాణిస్తుండడం వల్ల టాపార్డర్‌లో పెద్దగా సమస్య వచ్చే అవకాశం లేదు. శ్రేయస్‌, మనీశ్, కేదార్‌ జాదవ్‌, శివం దూబే.. ప్రతిభకు తగట్టు రాణిస్తే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు.

టీమిండియా జట్టు

ఓపెనింగ్‌ ఎవర్ని పంపాలనేది భారత్‌కు తలనొప్పిగా మారింది. రాహుల్, ధావన్‌లలో ఎవర్ని రోహిత్‌కు జోడిగా ఇవ్వాలనే విషయమై మల్లగుల్లాలు పడుతోంది. రాహుల్‌కు నిలకడ వరంలా మారగా, సుదీర్ఘ అనుభవం ధావన్‌కు కలిసొచ్చే అంశం. అస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డున్న శిఖర్​ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ సిరీస్‌లో అందరి చూపు మరోసారి రిషబ్‌ పంత్‌పై ఉండనుంది. ఇప్పటికే అనేక అవకాశాలు పొందిన పంత్‌.. ఈ సిరీస్‌లో ఎలాగైనా సత్తా చాటాలని కోహ్లీసేన కోరుకుంటోంది.

గత ఏడాది బౌలింగ్‌లో అద్భుతాలు సృష్టించిన భారత పేస్‌ దళం.. మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన జస్ప్రిత్ బుమ్రా.. వన్డేల్లో పునరాగమనాన్ని ఘనంగా చాటాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న షమి, సైనీ.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు సవాల్‌ విసురుతున్నారు. స్వదేశంలో భారత్‌కు ప్రధాన బలమైన స్పిన్‌తో ఆసిస్‌ను కట్టడి చేయాలని కోహ్లీ సేన భావిస్తోంది. కుల్‌దీప్‌, చాహల్‌కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశముంది.

ఆస్ట్రేలియా జట్టు

గత ఏడాది భారత్‌ పర్యటనలో వన్డే సిరీస్‌ గెలిచిన ఆసీస్ ఆ ఫలితాన్ని పునారావృతం చేయాలని భావిస్తోంది. ఆరోన్‌ పించ్‌, వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌లతో... కంగారూల బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్ఠంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టిస్తోన్న లబుషేన్‌.. భారత్‌పైనా సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాడు. ఆసీస్‌ బౌలింగ్‌ పటిష్ఠంగా ఉంది. కమ్మిన్స్‌, కేన్ రిచర్డ్స్, స్టార్క్‌లతో కూడిన పేస్‌ దళం.. కోహ్లీసేనను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details