కూల్‌గా ఆడుతూ.. బంతులను బౌండరీలు దాటిస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ.. అభిమానులను మాయ చేసే క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోని. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో అయినా మిస్టర్ కూల్‌గా వ్యవహరిస్తూ ఆటను మలుపు తిప్పడంలో దిట్టగా పేరుతెచ్చుకున్నాడు. తన కెప్టెన్సీతో అభిమానులకు మరచిపోలేని అనుభూతిని ఇచ్చాడు మహీ. అలాంటి క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ ఝార్ఖండ్ డైనమైట్ కెరీర్ విశేషాలు ఇవిగో...
2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో తన క్రికెట్ ప్రస్థానం ప్రారంభించాడు మహేంద్ర సింగ్ ధోని.
- ధోని ఆడిన తొలి మ్యాచ్‌లోనే సున్నా పరుగులకు రనౌటై నిరాశపర్చాడు.
- ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడే అత్యధికంగా ఐసీసీ ట్రోఫీలు భారత్ సొంతం చేసుకుంది.
- ఇప్పటివరకు 350 అంతర్జాతీయ వన్డేలు ఆడాడు మిస్టర్ కూల్.
2004లో సౌరభ్ గంగూలీ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ధోని అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించాడు.
కెరీర్ ప్రారంభంలో వెనుకంజ
కెరీర్ ప్రారంభంలో ధోని అంతగా రాణించలేకపోయాడు. మైదానంలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే అవుటై బయటకు వచ్చేసేవాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కేవలం 19 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు.
పాక్‌తో సిరీస్ మలుపుతిప్పింది
2005లో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అసలైన ధోని అభిమానులకు పరిచయమయ్యాడు. విశాఖలో జరిగిన వన్డేలో కెప్టెన్ గంగూలీ ధోనీని మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగమని సలహా ఇచ్చాడు. పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని ఏకంగా 123 బంతులకు 148 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మహీ తన కెరీర్లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
ట్రోఫీల పంట
2007 వరకు టీమిండియాపై ఉన్న అంచనాలను ధోని మార్చేశాడు. మహీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 3 మేజర్ ఐసీసీ టోర్నీల్లో( 2011లో ప్రపంచకప్, 2007లో టీ20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ)విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది భారత్.
ట్రాక్ రికార్డు
ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 538 మ్యాచ్‌లు ఆడిన ధోని 17వేల 266 రన్స్ చేశాడు. సగటు 44.95తో పరుగులు చేసిన మహీ... 16 శతకాలు, 108 హాఫ్ సెంచరీలు సాధించాడు. కీపర్‌గానూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్లో 829 మందిని ఔట్ చేశాడు మిస్టర్‌కూల్. ఇందులో 634 క్యాచ్‌లు, 195 స్టంప్ ఔట్లు ఉన్నాయి. 12 సీజన్ల ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 3 సార్లు విజేతగా, 5సార్లు రన్నరప్‌గా నిలిపాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం
ప్రస్తుతం ధోని క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రపంచకప్-2019లో సెమీ ఫైనల్ మ్యాచ్ మహీకి చివరిది. వరుసగా సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ఈ ఆటగాడి రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఇప్పటివరకు ధోని ఏం మాట్లాడలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్లో కనువిందు చేసే అవకాశముంది. వీలైతే ఆ తర్వాత జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ చోటు దక్కించుకోవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.