ఈ ఏడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన నేపథ్యంలో టీమ్ఇండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సన్నాహాలు చేస్తోంది. అయితే నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పర్యటనకు వచ్చే కోహ్లీసేనను, 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచేందుకు అంతా సిద్ధమని ఆసీస్ బోర్డు సీఈఓ నిక్ హాక్లీ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంగారూ దేశంలో రెండు వారాల క్వారంటైన్ తప్పనిసరి అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
"ఆస్ట్రేలియాలోని కరోనా నియంత్రణ నిబంధనల ప్రకారం నిర్బంధం తప్పనిసరి. మరో మార్గం లేదు. ప్రస్తుతం అందరం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇతర క్రికెట్ బోర్డులతో చర్చించి సిరీస్ షెడ్యూల్స్‌ను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. దీని వల్ల మ్యాచ్‌లను సవరించాల్సి ఉంటుంది. 14 రోజుల నిర్బంధం అంటే సిరీస్ ప్రణాళికే మారిపోతుంది. టీ20 సిరీస్‌ను సిద్ధం చేయాలని సీఏ భావిస్తోంది. ఆసీస్ పర్యటన ముగించుకున్న తర్వాత టీమ్ఇండియా.. ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఇంగ్లిష్ జట్టుతో ఓ పింక్ బాల్ టెస్టు ఆడాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ వేదికలను, ఆటగాళ్లు ఉండటానికి హోటళ్లను సిద్ధం చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించడం తప్పనిసరి"