2010, ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాపై గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ చేసిన ద్విశతకం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. అసాధ్యం అనుకున్న డబుల్ సెంచరీని సుసాధ్యం చేసి చూపించాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే అతడు ద్విశతకం సాధిస్తున్న సమయంలో క్రికెట్ ప్రపంచమంతా మునివేళ్ల మీద నిలబడింది. ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ అతడికి ఎక్కువ స్ట్రైకింగ్ ఇవ్వకపోవడం వల్ల ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తెందూల్కర్ 200 సాధిస్తాడా? లేదా అని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మొత్తంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో సచిన్ సాధించాడు. ఆ మధుర క్షణాలను మాస్టర్ బ్లాస్టర్ ఎలా అందుకున్నాడంటే..
2010లో భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. కానీ మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకుందామని రెండో వన్డేలో బరిలోకి దిగిన సఫారీలకు మరోసారి చుక్కెదురైంది. ఆదిలోనే సెహ్వాగ్‌ను ఔట్ చేసిన ఆనందం వారికి ఎక్కువ సేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ కార్తిక్‌తో కలిసి మాస్టర్ బ్లాస్టర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 194 పరుగులు జోడించారు. కార్తిక్ ఔటైన అనంతరం యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించి వెనుదిరిగాడు. అప్పటికీ సచిన్ 150 పూర్తిచేసుకున్నాడు.
ధోనీతో టెన్షన్ టెన్షన్..
పఠాన్ ఔటైన తర్వాత ధోనీ క్రీజులోకి వచ్చాడు. ధోనీ స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకుంటూ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 ఓవర్లకు సచిన్ 190 పరుగులు పూర్తిచేశాడు. కానీ 191 నుంచి ఒక్కో పరుగు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మరోవైపు చూస్తుండగానే ధోనీ 17 పరుగుల నుంచి 60 పరుగులు పూర్తిచేశాడు. స్ట్రైకింగ్ ఎక్కువ రాకపోవడం వల్ల సచిన్ మాత్రం 199లోనే ఉన్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ వచ్చేసింది. అభిమానుల్లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది.