వివ్ రిచర్డ్స్, కపిల్ దేవ్, సచిన్ తెందుల్కర్.. 80,90, 2000 దశకాల్లో ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. మరికొన్ని రోజుల్లో 2010 దశాబ్దం పూర్తి కానుంది. ఈ సందర్భంగా 2010-2020 మధ్యలో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ప్రభావం చూపిన టాప్-10 బ్యాట్స్‌మెన్ (పాయింట్ల వారీగా)గురించి ఇప్పుడు చూద్దాం!
విరాట్ కోహ్లీ.. 9.5/10
ఈ దశాబ్దపు మేటి క్రికెటర్లు జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో రెచ్చిపోతూ భారత క్రికెట్‌ను మరో స్థాయిలో ఉంచాడు. 2010 నుంచి ఇప్పటివరకు వన్డేల్లో 61.31 సగటుతో 11,036 పరుగులు చేశాడు. ఇందులో 42 శతకాలు, 51 అర్ధశతకాలు ఉన్నాయి. మొత్తంగా 239 వన్డేల్లో 11 వేల 520 పరుగులు సాధించాడు. 84 టెస్టుల్లో 54.98 సగటుతో 7202 పరుగులు చేశాడు. 74 టీ20ల్లో 2563 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఏబీ డివిలియర్స్.. 9.5/10
2010 దశకంలో డివిలియర్స్ ఆటకు ఫిదా అవ్వని క్రికెట్ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదేమో. ఫార్మాట్ ఏదైనా అదే జోరు కొనసాగిస్తూ.. 360 డిగ్రీల బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్ ఎవరైనా.. జట్టు ఏదైనా.. పిచ్ మారినా తన అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. 2010జనవరి నుంచి 135 మ్యాచ్‌లతో 6485 పరుగులు చేశాడు. ఈ దశాబ్దంలో కనీసం వెయ్యికిపైగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్లలో.. 64.20 సగటుతో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వేగవంతమైన 50, 100, 150 పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 109.76 స్ట్రైక్ రేట్‌తో అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్‌గా ఏబీ ఘనత సాధించాడు.
రోహిత్ శర్మ.. 9/10
హిట్ మ్యాన్‌కు గురించి చెప్పాలంటే.. 2013కు ముందు తర్వాత అని చెప్పొచ్చు. అప్పటి నుంచే టీమిండియా ఓపెనర్ అవతారమెత్తి ఎవరూ సాధించలేని ఘనతలు అందుకున్నాడు. ఈ దశాబ్దంలో 52.92 సగటుతో 7991 పరుగులు చేశాడు. ఇందులో 3 ద్విశతకాలతో పాటు మొత్తం 27 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా టీ20ల్లో 2562 పరుగులతో విరాట్‌తో పోటీ పడుతున్నాడు. ఇటీవలే జరిగిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి ద్విశతకంతో 5- రోజుల ఫార్మాట్లోనూ సత్తాచాటగలనని నిరూపించాడు.
హషీమ్ ఆమ్లా.. 9/10
ఈ దశాబ్దంలో క్రికెట్ అభిమాని మరిచిపోలేని మరో అద్భుతమైన ఆటగాడు హషీమ్ ఆమ్లా. వన్డేల్లో వేగంగా 5వేలు, 7వేల పరుగులతో పాత రికార్డుల బ్రేక్ చేస్తూ వెళ్తుంటే.. విరాట్ రికార్డులు బద్దలు కొట్టుకుంటూ వచ్చాడీ దక్షిణాఫ్రికా ఓపెనర్. 2వేలు నుంచి 7వేల పరుగుల వరకు వేగంగా అందుకున్నాడు ఆమ్లా. 181 వన్డేల్లో 49.47 సగటుతో 8113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి. డివిలియర్స్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా గుర్తింపు తెచ్చుకున్నాడు.
రాస్ టేలర్.. 8.5/10
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ ఈ దశాబ్దంలో అత్యుత్తమ ఫామ్‌తో చెలరేగాడు. ముఖ్యంగా మిడిలార్డర్ క్రికెటర్లలో అత్యంత స్థిరంగా ఆడిన వాళ్లలో టేలర్ ముందు వరుసలో ఉన్నాడు. జనవరి 2010 తర్వాత 6428 పరుగులు చేశాడు. ఇందులో 17 శతకాలు, 39 అర్ధసెంచరీలు ఉన్నాయి. కేన్ విలియమ్సన్తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కివీస్.. గత రెండు ప్రపంచకప్‌ల్లో కివీస్ ఫైనల్ చేరడంలో ముఖ్య పాత్ర పోషించాడు. చాపకింద నీరులా.. ఆడుతూ ప్రత్యర్థి జట్లకు చేయాల్సిన నష్టాన్ని కలిగించడంలో రాస్ టేలర్ దిట్ట.