తెలంగాణ

telangana

ETV Bharat / sports

Cricket Rewind 2021: క్రికెట్​లో అరుదైన ఫీట్లు.. ఈ ఏడాది తక్కువే! - హర్షల్ పటేల్ హిట్ వికెట్

Cricket rewind 2021: క్రికెట్​లో హ్యాట్రిక్ వికెట్లు సాధించడమనేది అరుదుగా జరిగే విషయం. అలాగే హిట్ వికెట్ అవడం కూడా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎవరెవరు హ్యాట్రిక్ వికెట్లు తీశారో, ఎంతమంది హిట్ వికెట్​గా వెనుదిరిగారో చూద్దామా!

Cricket rewind 2021, క్రికెట్ రివైండ్ 2021
Cricket rewind 2021

By

Published : Dec 28, 2021, 6:58 PM IST

Cricket rewind 2021: టీ20, వన్డేలు, టెస్టులు అనే తేడా లేకుండా విజయం కోసం అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు తీవ్రంగా కష్టపడతారు. క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌ అయినా.. హ్యాట్రిక్‌ వికెట్లు, హిట్ వికెట్‌గా ఔట్‌ కావడం‌, టెస్టుల్లో త్రిబుల్ శతకం బాదడం, టీ20ల్లో సూపర్‌ ఓవర్లు అరుదుగా జరిగేవే. మరి 2021 ఏడాదిలో చోటు చేసుకున్న ఆ అరుదైన ఫీట్‌లు ఎప్పుడు జరిగాయి.. ఎవరి పేరిట నమోదయ్యాయో సంవత్సరాంతం సందర్భంగా ఓసారి పరిశీలిద్దాం..

హ్యాట్రిక్‌ వీరులు వీరే..

Hattrick wickets in 2021: వరుసగా మూడు వికెట్లను పడగొట్టడమంటే అంత తేలికేం కాదు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినంత పని. రెండు వికెట్లను వెంటవెంటనే తీసిన తర్వాత వచ్చే బ్యాటర్‌ చాలా అలర్ట్‌గా ఉంటాడు. అతడిని కన్‌ఫ్యూజ్‌ చేయాలి. దాని కోసం సంక్లిష్టమైన బంతిని సంధించాలి. అప్పుడే వికెట్‌ దక్కుతుంది. మరి అలాంటి ఫీట్‌ను ఈ ఏడాది ఒకే టోర్నమెంట్‌లో ముగ్గురు బౌలర్లు సాధించడం విశేషం.

  • టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఆల్‌రౌండర్‌ కర్టిస్ కాంఫర్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టిన కాంఫర్‌ ఐర్లాండ్‌ (4/26) గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గానూ ఎంపికయ్యాడు.
  • శ్రీలంక ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగ (3/20) పటిష్ఠమైన దక్షిణాఫ్రికా మీద వరుసగా మూడు వికెట్లు తీయడం అద్భుతం. అయితే ఓటమిని మాత్రం ఆపలేకపోయాడు. దక్షిణాఫ్రికాపై శ్రీలంక తొలుత 142 పరుగులు చేసింది. అనంతరం ఆఖరి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. వరుస బంతుల్లో కీలకమైన బవుమా (46), మారక్రమ్ (19), డ్వేన్‌ ప్రిటోరియస్‌ (0) వికెట్లు తీసి హసరంగ సంచలనం సృష్టించాడు. అయితే కగిసో రబాడ (7 బంతుల్లో 13: ఒక సిక్స్, ఒక ఫోర్‌) బాదేయడంతో విజయం ప్రొటీస్‌ జట్టువైపు మొగ్గింది.
    హసరంగ
  • దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ (4/48) ఇంగ్లాండ్ మీద హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా189/2 భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో 165/5తో ఉన్న ఇంగ్లాండ్‌కు ఆఖరి 11 బంతుల్లో విజయానికి 25 పరుగులు కావాలి. క్రికెట్‌లో ఎప్పుడు ఏ విధంగా మ్యాచ్‌ మలుపు తిరుగుతుందో చెప్పలేం. క్రీజ్‌లో ఇయాన్‌ మోర్గాన్‌, క్రిస్‌ వోక్స్ ఉన్నారు. 19వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్‌లో 14 రన్స్ కొడితే విజయం ఇంగ్లాండ్‌దే. ఇక్కడే రబాడ అద్భుతం చేశాడు. మంచి ఊపులో ఉన్న మోర్గాన్‌, క్రిస్‌ వోక్స్‌తోపాటు అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన జొర్డాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో కేవలం నాలుగు పరుగులే చేసిన ఇంగ్లాండ్ (179/8) పది పరుగుల తేడాతో ఓడింది. అయినా అప్పటికే ఇంగ్లాండ్‌ సెమీస్‌కు దూసుకెళ్లగా.. దక్షిణాఫ్రికా ఇంటిముఖం పట్టకతప్పలేదు.

టెస్టుల్లో ఏకైక బౌలర్

ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో ఒకే ఒక్క బౌలర్‌ హ్యాట్రిక్‌ తీయడం విశేషం. వెస్టిండీస్‌ మీద దక్షిణాఫ్రికా బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ (5/36) ఈ ఫీట్‌ సాధించాడు. జూన్‌లో దక్షిణాఫ్రికా రెండు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు విండీస్‌ పర్యటనకు వెళ్లింది. జూన్ 18 నుంచి 22వ తేదీ వరకు జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కేశవ్‌ మహరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిపోయాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విండీస్‌ 165 పరుగులకే కుప్పకూలడంలో కీలకపాత్ర పోషించాడు. వరుస బంతుల్లో కీరన్‌ పావెల్, జాసన్ హోల్డర్‌, జాషువా సిల్వా వికెట్లను పడగొట్టాడు.

కేశవ్ మహారాజ్
  1. ఈ ఏడాది ఒక్క త్రిబుల్‌ సెంచరీ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

హిట్ వికెట్.. టెస్టుల్లో ఒకరు, టీ20ల్లో ఒకరు

Hit Wicket out in 2021: యాషెస్‌ సిరీస్‌ అంటేనే రెండు దేశాలు సింహాల్లా పోట్లాడతాయి. గెలుపు సంగతి పక్కన పెడితే ఓటమి నుంచి గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు ఇరుజట్ల ఆటగాళ్లు. ఇలాంటి సందర్భంలో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగితే ఆ బాధ వర్ణణాతీతం. ఇటువంటి పరిస్థితే ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్‌కు ఎదురైంది. యాషెస్‌ రెండో టెస్టులో ఓటమి అంచులో ఉన్న జట్టును ఆదుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. దాదాపు 34 ఓవర్లకుపైగా (207 బంతుల్లో 26 పరుగులు) క్రీజ్‌లో నిలబడ్డాడు. క్రిస్‌ వోక్స్‌తో కలిసి ఒక సెషన్‌పాటు వికెట్‌ పడకుండా బ్యాటింగ్‌ చేశాడు. స్వల్ప వ్యవధిలో వోక్స్‌తోపాటు ఓలీ రాబిన్‌సన్ పెవిలియన్‌కు చేరారు. అయితే అప్పటికీ బట్లర్‌ ఉన్నాడనే దీమా ఇంగ్లాండ్‌ శిబిరంలో ఉంది. ఆఖరి సెషన్‌లో బట్లర్‌కు తోడు బ్రాడ్‌ ఉండటంతో కనీసం డ్రాగా ముగిస్తుందన్న ఇంగ్లాండ్‌ క్రికెటర్ల ఆశకు బ్రేక్‌ పడింది. టీ విరామం తర్వాత కాసేపటికే రిచర్డ్‌సన్‌ బంతిని ఆఫ్‌సైడ్‌ ఆడే ప్రయత్నంలో బట్లర్‌ తన కాలితో స్టంప్స్‌ను తన్నుకున్నాడు. దీంతో పాపం ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు.

బట్లర్ హిట్ వికెట్

టీ20ల్లో మనోడే

టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ పర్యటనకు వచ్చింది. మూడు టీ20ల సిరీస్‌లో భారత బౌలర్‌ హర్షల్‌ పటేల్ అరంగేట్రం చేశాడు. పాపం ఇదే సిరీస్‌ చివరి మ్యాచ్‌లో హిట్‌ వికెట్‌గా ఔటై పెవిలియన్‌కు చేరాడు. ఫాస్ట్‌బౌలర్‌ అయిన హర్షల్‌ ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగాడు. కేవలం 11 బంతుల్లోనే ఒక సిక్స్, రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు రాబట్టాడు. ఫెర్గూసన్‌ వేసిన పంతొమ్మిదో ఓవర్‌ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచిన హర్షల్‌.. తర్వాతి బంతికి పరుగు తీయలేదు. అయితే మూడో బంతిని కట్‌ షాట్‌ కొట్టబోయాడు. ఈ క్రమంలో బ్యాట్‌ వికెట్లను తాకేసింది. దీంతో టీ20ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన రెండో టీమ్‌ఇండియా బ్యాటర్‌ అయ్యాడు. అంతకుముందు (2018లో) శ్రీలంకతో సిరీస్‌లోనూ కేఎల్‌ రాహుల్‌ ఇలానే హిట్‌వికెట్‌ రూపంలో ఔటై పెవిలియన్‌కు చేరడం గమనార్హం.

హర్షల్ పటేల్ హిట్ వికెట్

అంతర్జాతీయ టీ20ల్లో ఒకసారే సూపర్ ఓవర్‌..

Super Overs in 2021: టెస్టుల్లో సూపర్‌ ఓవర్‌ ప్రసక్తే ఉండదు. ఇక వన్డేల్లోనూ సూపర్‌ ఓవర్‌ రూల్‌ తీసుకొచ్చినా.. ఈ ఏడాది దాని అవసరం రాలేదు. పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్‌ ఫలితం తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ భలేగా పనికొస్తుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌, ఐపీఎల్‌ సహా దేశాల మధ్య టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అయితే 2021 సంవత్సరంలో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఒకసారి సూపర్ ఓవర్‌ ద్వారా ఫలితం తేలింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ అమెరికన్ రీజియన్‌ క్వాలిఫయిర్‌లో భాగంగా కెనడా, యూఎస్‌ఏ జట్ల మధ్య నవంబర్ 10న మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కెనడా 142 పరుగులు చేసింది. అనంతరం యూఎస్‌ఏ కూడా సరిగ్గా 142 పరుగులే చేయడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలుత యూఎస్‌ఏ సూపర్‌ఓవర్‌లో 22/1 స్కోరు సాధించగా.. కెనడా 14 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్X దిల్లీ..

అత్యంత క్రేజీ దేశవాళీ లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌). కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సంవత్సరం రెండు దశల్లో ఐపీఎల్‌ జరిగింది. గతేడాది సీజన్‌లో నాలుగు సూపర్‌ ఓవర్లతో ఫలితం తేలిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మాత్రం ఒకే ఒకసారి సూపర్ ఓవర్‌ అవసరమొచ్చింది. భారత్‌ వేదికగా తొలి దశ పోటీల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితం సూపర్‌ ఓవర్‌తోనే తేలింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 159 పరుగులు చేయగా.. అనంతరం హైదరాబాద్‌ కూడా సరిగ్గా 159 పరుగులే వద్దే ఆగిపోయింది. ధాటిగా ఆడే డేవిడ్‌ వార్నర్, విలియమ్సన్ సూపర్‌ ఓవర్‌లో కేవలం ఏడు పరుగులే చేశారు. దీంతో ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీకి కూడా తేలిగ్గా విజయం వరించలేదు.

ఇవీ చూడండి

అరంగేట్ర మ్యాచ్​లోనే అద్భుతం చేశారు

2021 Cricket Highlights: భారీ సిక్సర్లు.. స్టన్నింగ్ క్యాచ్​లు!

ఈ ఏడాది టెస్టుల్లో 'సూపర్ స్టార్స్' వీరే!

ABOUT THE AUTHOR

...view details