తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంక క్రికెటర్​ చీటింగ్​!.. బ్యాటర్​ను క్రీజులోకి రానీయకుండా అడ్డుకుని.. రనౌట్​కు​ కారణమై.. - contraversial run out latest

ఐసీసీ అండర్​-19 టీ20 మహిళల ప్రపంచకప్​లోని భాగంగా ఆసీస్​-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ లంక క్రికెటర్​ క్రీడాస్ఫూరికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది. అసలేం జరిగిందంటే?

contraversial run out
contraversial run out

By

Published : Jan 20, 2023, 7:05 PM IST

ఐసీసీ అండర్‌-19 టీ20 వుమెన్స్‌ వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. శ్రీలంక మహిళా క్రికెటర్‌ ఐసీసీ రూల్స్‌ను తుంగలోకి తొక్కి క్రీడాస్ఫూరికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది సదరు లంక క్రికెటర్‌. వివరాల్లోకి వెళితే..

టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్‌, శ్రీలంక వుమెన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఆస్ట్రేలియా వుమెన్స్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ నేత్రాంజలి వేసింది. ఆ ఓవర్‌ చివరి బంతిని అమీ స్మిత్‌ లాంగాఫ్‌ దిశగా ఆడింది. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో అమీ స్మిత్‌ పరిగెత్తింది. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న హామిల్టన్‌ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో దిశానాయకే బంతి అందుకొని నాన్‌స్టైక్ర్‌ ఎండ్‌ వైపు విసిరింది.

అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న నేత్రాంజలి హామిల్టన్‌కు క్రీజులోకి రాకుండా కావాలనే ఆమెకు అడ్డుగా వెళ్లింది!. ఇదంతా రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే బంతి నేరుగా వికెట్లను గిరాటేయడం.. అంపైర్‌ రనౌట్‌ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ లంక బౌలర్‌ అడ్డుకోకపోయుంటే హామిల్టన్‌ సకాలంలో క్రీజులోకి చేరేదే. ఈ పరిణామంతో షాక్‌ తిన్న ఆసీస్‌ బ్యాటర్లు ఇదేం చర్య అన్నట్లుగా చూశారు. కానీ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో చేసేదేం లేక హామిల్టన్‌ నిరాశగా పెవిలియన్‌ చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత క్లియర్‌గా చీటింగ్‌ అని తెలుస్తుంది.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం'' అంటూ కామెంట్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వుమెన్స్‌ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ వుమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎల్లా హేవార్డ్‌ 36, సియాన్నా జింజర్‌ 30 పరుగులు, కేట్‌ పిల్లే 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లంక మహిళల జట్టు 51 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే డబుల్‌ డిజిట్‌ మార్క్‌ అందుకోగా.. మిగతా పది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మ్యాగీ క్లార్క్‌ , లూసీ హామిల్టన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details