South Africa Covid Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్(బీ.1.1.529)తో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. తమ దేశంలోనూ ఆ వేరియంట్ ప్రభావం కనిపిస్తుందంటూ పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోత్స్వానా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు(South Africa Travel Ban) విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త రకంతో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే సిరీస్ సందిగ్ధంలో పడింది.
India SA Tour 2021: డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది భారత్. దాదాపు ఏడు వారాల సుదీర్ఘ పర్యటనలో మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సి ఉంది. ఇందుకోసం వచ్చే నెల 8న సీనియర్ జట్టు సౌతాఫ్రికాకు పయనమవ్వాలి. ఇప్పటికే ఆ దేశంలో అనధికారిక టెస్టు సిరీస్‌లో తలపడుతున్న భారత్-ఏ జట్టులో కొందరిని అక్కడే ఉంచేలా ప్లాన్ చేసింది బీసీసీఐ. అసలు సిరీస్ 17న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త రకం కరోనా ఇరుదేశాల క్రికెట్ బోర్డుల్ని కలవరపెడుతోంది. దీనిపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. ఈ విషయమై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
"దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వారి దేశంలోని పూర్తి పరిస్థితిపై స్పష్టత ఇచ్చేవరకు మేము ఏమీ మాట్లాడలేం. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం కివీస్‌తో సిరీస్ ముగిశాక టీమ్ఇండియా వచ్చే నెల 8 లేదా 9న సౌతాఫ్రికాకు బయలుదేరి వెళుతుంది. కరోనా కొత్త వేరియంట్ కారణంగా పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం గురించి మేము ఎదురుచూస్తున్నాం" అని ఓ అధికారి వెల్లడించారు.