తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కామన్వెల్త్'​ తొలిరోజు మెరుగ్గానే.. టీటీ, బ్యాడ్మింటన్‌లో భారత్​ శుభారంభం - కామన్వెల్త్​ గేమ్స్​ తేదీలు

Commonwealth Games: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ క్రీడలను భారత్‌ మెరుగ్గా మొదలెట్టింది. తొలి రోజు పతకం సాధించలేకపోయినా.. వివిధ క్రీడల్లో మన అథ్లెట్లు సత్తాచాటారు. టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, హాకీలో శుభారంభమే దక్కింది. మరోవైపు ఈ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన అమ్మాయిల క్రికెట్లో టీమ్‌ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. బలమైన ఆస్ట్రేలియా చేతిలో జట్టు ఓడింది. శనివారం వెయిట్‌లిఫ్టింగ్‌లో.. మీరాబాయి చాను పతక ఆశలు రేపుతోంది.

commonwealth first day games and indian players
commonwealth first day games and indian players

By

Published : Jul 30, 2022, 7:03 AM IST

Commonwealth Games: కామన్వెల్త్‌ క్రీడల టేబుల్‌ టెన్నిస్‌లో భారత ఆధిపత్యం మళ్లీ మొదలైంది. శుక్రవారం టీమ్‌ విభాగంలో అమ్మాయిల జట్టు వరుసగా రెండు విజయాలతో క్వార్టర్స్‌ చేరింది. ఈ విజయాల్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కీలక పాత్ర పోషించింది. గ్రూప్‌- 2 తొలి పోరులో భారత్‌ 3-0తో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. డబుల్స్‌లో శ్రీజ- రీత్‌, సింగిల్స్‌లో స్టార్‌ క్రీడాకారిణి మనిక బాత్రా, శ్రీజ విజయం సాధించారు. పురుషుల గ్రూపు-3 పోరులో భారత్‌ 3-0తో బార్బడోస్‌ను మట్టికరిపించింది. అనంతరం గ్రూప్‌- 2లో రెండో మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 3-0తో ఫిజీని చిత్తుచేశారు. డబుల్స్‌లో శ్రీజ- దియా, సింగిల్స్‌లో మనిక, శ్రీజ విజయాలు సాధించారు.

.
.

మరోవైపు పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత స్టార్‌ బాక్సర్‌ శివ థాపా ప్రిక్వార్టర్స్‌ చేరాడు. తొలి రౌండ్లో అతను 5-0 తేడాతో సులేమాన్‌ (పాకిస్థాన్‌)పై విజయం సాధించాడు. స్క్వాష్‌లో 14 ఏళ్ల అనాహత్‌ సింగ్‌ తొలి రౌండ్లో 11-5, 11-2, 11-0తో జాడా రోస్‌ (సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ది గ్రెనడైన్స్‌)ను చిత్తుచేసింది. ట్రయథ్లాన్‌ పురుషుల వ్యక్తిగత స్ప్రింట్‌ డిస్టెన్స్‌ ఫైనల్లో ఆదర్శ్‌ 30వ, విశ్వనాథ్‌ 33వ స్థానాల్లో నిలిచారు. తొలి రోజు పోటీల్లో భారత సైక్లింగ్‌ జట్లు నిరాశ పరిచాయి. ఫైనల్‌ చేరడంలో మూడు జట్లూ విఫలమయ్యాయి. స్క్వాష్‌లో 14 ఏళ్ల అనాహత్‌ సింగ్‌ తొలి రౌండ్లో 11-5, 11-2, 11-0తో జాడా రోస్‌ (సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ది గ్రెనడైన్స్‌)ను చిత్తుచేసింది.

.

సెమీస్‌లో శ్రీహరి..
భారత స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సెమీస్‌లో ప్రవేశించాడు. హీట్స్‌లో శ్రీహరి (54.68 సెకన్లు) మూడో స్థానంలో నిలిచాడు. పీటర్‌ (53.91సె) అగ్రస్థానం సాధించాడు.

హాకీలో ఘనంగా..
కామన్వెల్త్‌ క్రీడలను హాకీ అమ్మాయిల జట్టు ఘనంగా మొదలెట్టింది. పూల్‌- ఎలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ 5-0 తేడాతో ఘనాను చిత్తుచేసింది. గుర్జిత్‌ కౌర్‌ (3వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తాచాటింది. నేహా (28వ), సంగీత (36వ), సలీమా (56వ) తలో గోల్‌ కొట్టారు. భారత్‌ శనివారం తన రెండో మ్యాచ్‌లో వేల్స్‌తో తలపడుతుంది.

పాక్‌ను చిత్తుచేసి..
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో శుభారంభం చేసింది. గ్రూప్‌- ఎ మ్యాచ్‌లో భారత్‌ 5-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. మొదట మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌- అశ్విని జోడీ 21-9, 21-12తో ఇర్ఫాన్‌- ఘజాలాపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-7, 21-12తో మురాద్‌ అలీపై, మహిళల సింగిల్స్‌లో సింధు 21-7, 21-6తో మహూర్‌ షాజాద్‌పై గెలవడంతో 3-0తో భారత విజయం ఖాయమైంది. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ 21-12, 21-9తో మురాద్‌- గ్రేస్‌పై, మహిళల డబుల్స్‌లో గాయత్రి- ట్రీసా 21-4, 21-5తో మహూర్‌- ఘజాలాపై పైచేయి సాధించారు.

.

అమ్మాయిలు ఓటమితో
కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత అమ్మాయిలకు ఆశించిన ఆరంభం దక్కలేదు. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకుంది. గ్రూపు-ఎ తొలి మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (24; 17 బంతుల్లో 5×4), షెఫాలీ (48; 33 బంతుల్లో 9×4), హర్మన్‌ప్రీత్‌ (52; 34 బంతుల్లో 8×4, 1×6) రాణించారు. స్పిన్నర్‌ జెస్‌ జొనాసెన్‌ (4/22) భారత్‌ను దెబ్బ తీసింది. అనంతరం ఛేదనలో ఆసీస్‌ను మరో ఓవర్‌ మిగిలివుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రేణుక సింగ్‌ (4/18) ధాటికి ఆసీస్‌ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ.. గ్రేస్‌ హారిస్‌ (37), ఆష్లీ గార్డ్‌నెర్‌ (52 నాటౌట్‌) జట్టును గెలిపించారు.

.

కామన్వెల్త్‌లో ఈనాడు భారత పోటీలు

  • స్విమ్మింగ్‌ (పురుషులు): 200మీ.ఫ్రీస్టైల్‌ హీట్స్‌- కుశాగ్ర (మ.3.06 నుంచి)
  • ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌: మహిళల టీమ్‌ ఫైనల్‌, వ్యక్తిగత క్వాలిఫికేషన్‌- రుతుజ, సమంత, ప్రణతి (రాత్రి 9 నుంచి)
  • మారథాన్‌ఫైనల్‌ (పురుషులు) నితేంద్ర సింగ్‌ (మ.1.30)
  • బ్యాడ్మింటన్‌: మిక్స్‌డ్‌ టీమ్‌- భారత్‌ × శ్రీలంక (మ.1.30 నుంచి), భారత్‌ × ఆస్ట్రేలియా (రాత్రి 11.30 నుంచి)
  • బాక్సింగ్‌: హుసాముద్దీన్‌, లవ్లీనా, సంజీత్‌ (సా.5 నుంచి)
  • స్క్వాష్‌:పురుషులు, మహిళల తొలి రౌండ్‌- రమిత్‌, సౌరభ్‌, సునయ సారా, జోష్న (సా.5 నుంచి)
  • హాకీ (మహిళలు) భారత్‌ × వేల్స్‌ (రాత్రి 11.30 నుంచి)
  • టేబుల్‌ టెన్నిస్‌ (మూడో రౌండ్‌) మహిళలు- భారత్‌ × గయానా (మ.2 నుంచి); పురుషులు- భారత్‌ × నార్తర్న్‌ ఐర్లాండ్‌ (సా.4.30 నుంచి)
  • సైక్లింగ్‌: మహిళల స్ప్రింట్‌ క్వాలిఫయింగ్‌- మయూరి, త్రియాషా (మ.2.30 నుంచి); మహిళల 3000మీ. వ్యక్తిగత పర్స్యూట్‌ క్వాలిఫయింగ్‌- మీనాక్షి (మ.2.30 నుంచి); పురుషుల కీరిన్‌ తొలి రౌండ్‌- అల్బెన్‌ (రాత్రి.8.30 నుంచి)
  • వెయిట్‌లిఫ్టింగ్‌: పురుషుల 55 కేజీలు- సంకేత్‌ సాగర్‌ (మ.1.30 నుంచి); పురుషుల 61 కేజీలు- గురురాజా (సా.4.15 నుంచి); మహిళల49కేజీలు- మీరాబాయి (రాత్రి 8 నుంచి); మహిళల 55 కేజీలు- బింద్యారాణి దేవి (రాత్రి 12.30 నుంచి)
  • లాన్‌బౌల్స్‌: పురుషుల ట్రిపుల్‌- భారత్‌ × మాల్టా (మ.1 నుంచి); మహిళల సింగిల్స్‌- తనియా × లారా (వేల్స్‌) (మ.1 నుంచి); పురుషుల పెయిర్‌- భారత్‌ × కుక్‌ ఐస్‌ల్యాండ్స్‌ (రా.7.30 నుంచి); మహిళల ఫోర్‌- భారత్‌ × కెనడా (రా.7.30 నుంచి)

ఇవీ చదవండి:2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్​కు మూడో ర్యాంక్‌.. మరి ఇప్పుడో?

గ్రాండ్​గా కామన్వెల్త్​ గేమ్స్​ ఆరంభ వేడుక.. హైలైట్​గా డ్యూరన్​ లైవ్​ షో

ABOUT THE AUTHOR

...view details