Common Wealth Games 2022: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత జోరు కొనసాగుతోంది. తాజాగా వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల 73 కేజీల ఫైనల్లో అచింత షూలి పసిడి సాధించాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ పోటీలో ఆరంభం నుంచి స్థిరంగా బరువులు ఎత్తిన 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్టర్ ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురైనా వారిని వెనక్కి నెట్టి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి ప్రయత్నంలోనే 137 కేజీల బరువు లిఫ్ట్ చేసిన అచింత.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలు.. మూడో ప్రయత్నంలో 143 ఎత్తి గేమ్స్ రికార్డును సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు.
పసిడి పట్టేసిన 19 ఏళ్ల యువ జవాన్.. అంతకుముందు ఆదివారం 19 ఏళ్ల కుర్రాడు జెరెమీ లాల్రినుంగా దేశానికి రెండో పసిడి అందించగా.. బింద్యారాణి రజతం సొంతం చేసుకుంది. ఆదివారం పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ పూర్తి ఆధిపత్యం చలాయించి ఛాంపియన్‌గా నిలిచాడు. మొత్తం 300 కేజీల బరువెత్తి సరికొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డునూ సృష్టించాడు. స్నాచ్‌లో 140 కేజీలెత్తి ఆ విభాగంలోనూ కామన్వెల్త్ రికార్డు నెలకొల్పిన అతను.. క్లీన్ అండ్ జర్క్‌లో ఉత్తమంగా 160 కేజీల ప్రదర్శన చేశాడు. పతక అంచనాలతో బరిలో దిగిన ఈ ఐజ్వాల్ కుర్రాడు స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 136 కేజీలెత్తి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. రెండో ప్రయత్నంలో విజయవంతంగా 140 కేజీలెత్తాడు.
మూడో ప్రయత్నంలో (143 కేజీలు) విఫలమైనా.. అప్పటికే అతను తన సమీప ప్రత్యర్థి కంటే 10 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. ఇక క్లీన్ అండ్ జర్క్‌లో మొదట 154 కిలోలెత్తిన అతను వెంటనే తొడ, పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఇబ్బంది పడుతూనే రెండో ప్రయత్నంలో 160 కేజీల ప్రదర్శనతో స్వర్ణం ఖాయం చేశాడు. చివరి ప్రయత్నంలో (165 కేజీలు) మోచేతి గాయంతో విఫలమయ్యాడు. వైపావా నెవో (293 కేజీలు, సమోవా), జోసెఫ్ (290 కేజీలు, నైజీరియా) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
రజతం అందించిన బింద్యారాణి.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన మహిళల 55 కిలోల విభాగం పోటీలో బింద్యారాణి దేవి కేవలం ఒక్క కిలో తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. 202 కేజీల ప్రదర్శనతో వెండి పతకం కైవసం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల రికార్డుతో అదిజాత్ అదెనిక్ (203 కేజీలు, నైజీరియా) స్వర్ణం, స్థానిక క్రీడాకారిణి ఫ్రేయర్ మోరో (198 కేజీలు) కాంస్యం గెలిచారు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో (తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 81, 84) 86 కేజీల బరువెత్తి తన వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన నమోదు చేసిన బింద్యారాణి ఆ విభాగం ముగిసే సరికి మూడో స్థానంలో నిలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి ప్రయత్నంలో 110 కేజీలెత్తిన ఆమె.. రెండో ప్రయత్నం (114)లో విఫలమైంది.
తిరిగి బలంగా పుంజుకున్న ఆమె మూడో ప్రయత్నంలో 116 కేజీలెత్తి ఆ విభాగంలో కామన్వెల్త్ క్రీడల రికార్డు సృష్టించి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల 59 కేజీల విభాగంలో హజరిక 183 కేజీల ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలో 81 కేజీలు ఎత్తిన ఆమె.. తర్వాతి రెండు సార్లు (84, 86 కేజీలు) విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కేవలం రెండో ప్రయత్నం (102 కేజీలు)లో మాత్రమే ఆమె సఫలమైంది. ఇప్పటికే వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను స్వర్ణం, సంకేత్ రజతం, గురురాజ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.
అమ్మయిలు అదరహో..
ఓపెనర్ స్మృతి మంధాన (63 నాటౌట్; 42 బంతుల్లో 8×4, 3×6) చెలరేగడంతో కామన్వెల్త్ క్రీడల మహిళల క్రికెట్లో భారత జట్టు తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20ల్లో పాక్‌తో తలపడిన భారత్.. దాయాదిపై వరుసగా అయిదో విజయంతో అదరగొట్టింది. ఉదయం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్‌ను 18 ఓవర్లకు కుదించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. రేణుక సింగ్ (1/20), మేఘన సింగ్ (1/21), స్నేహ్ రాణా (2/15), రాధా యాదవ్ (2/18), షెఫాలీ వర్మ (1/8) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి పాక్‌ను కట్టడి చేశారు. మునీబా అలీ (32; 30 బంతుల్లో 3×4, 1×6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. స్నేహ్ ఒకే ఓవర్లో బిస్మా (17), మునీబాలను ఔట్ చేయడంతో పాక్ కోలుకోలేకపోయింది. అనంతరం స్మృతి చెలరేగడంతో లక్ష్యానిన్ని భారత్ 11.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన స్మృతి అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (16; 9 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి స్మృతి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించింది. షెఫాలీ ఔటైనా స్మృతి జోరు తగ్గలేదు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (14; 16 బంతుల్లో 2×4)తో కలిసి రెండో వికెట్‌కు 33 పరుగులు జతచేసిన స్మృతి.. ఫాతిమా సనా బౌలింగ్‌లో బౌండరీతో జట్టుకు విజయాన్ని అందించింది.