Commonwealth Games: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు వచ్చేశాయ్. 12 రోజుల సందడి తెచ్చేశాయ్. గురువారం కేవలం ఆరంభ వేడుకలు మాత్రమే జరుగుతాయి. ఆ తర్వాత 11 రోజుల పాటు ఇక ఆటల పోరాటాలు.. అథ్లెట్ల పతక ఆరాటాలు.. అభిమానుల విజయ కేరింతలు.. ఇక క్రీడా వినోదం మరోస్థాయికి చేరనుంది. ఆగస్టు 8న ఇవి ముగుస్తాయి. 72 ఏళ్ల క్రితం 1930లో ఈ క్రీడలకు బీజం పడింది. మధ్యలో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లో పోటీలు జరగలేవు. ఆ తర్వాత ప్రతి నాలుగేళ్లకోసారి క్రీడా ప్రేమికులను ఇవి అలరిస్తూనే ఉన్నాయి. ఈ క్రీడలకు ఇంగ్లాండ్ మూడోసారి ఆతిథ్యమిస్తోంది. 1934, 2002లో ఈ దేశంలోనే క్రీడలు జరిగాయి. భారత్ ఒకే ఒక్కసారి (2010) ఈ క్రీడలను నిర్వహించింది. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమెరికా.. మరోసారి ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమైంది. 2018లో స్వదేశంలో జరిగిన క్రీడల్లో ఆ దేశమే అగ్రస్థానంలో నిలిచింది. అప్పుడు మూడో స్థానంలో నిలిచిన భారత్ కూడా పతకాల కోసం గట్టిగానే పోరాడనుంది.
ఇవీ కీలకం..
షూటింగ్ గైర్హాజరీలో భారత్ ప్రధానంగా వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌పైనే ఆశలు పెట్టుకుంది. ఈ క్రీడల్లో పోటీపడే అథ్లెట్లపై భారీ అంచనాలున్నాయి. రెజ్లింగ్‌లో బరిలో దిగనున్న 12 మంది కూడా పతకాలు సాధించే సత్తా ఉన్నవాళ్లే. డిఫెండింగ్ ఛాంపియన్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా మరోసారి పసిడి అందుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. టోక్యో ఒలింపిక్ రజత విజేత మీరాబాయి చాను సారథ్యంలోని వెయిట్‌లిఫ్టింగ్ బృందం పతక వేటకు సిద్ధమైంది. రెండు సార్లు ఒలింపిక్స్ పతకం గెలిచిన పీవీ సింధు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలు కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌తో కూడిన బ్యాడ్మింటన్ బలగం కూడా బలంగానే ఉంది. గత కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ మరోసారి అదే ప్రదర్శన రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో కూడిన బాక్సింగ్ విభాగమూ అంచనాలను అందుకోవాలనే ధ్యేయంతో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో చారిత్రక ప్రదర్శన చేసిన హాకీ జట్లు.. అదే జోరు కొనసాగిస్తే పతకాలు గెలిచే ఆస్కారముంది. అథ్లెటిక్స్‌లోనూ కొన్ని మెరుపులు చూడొచ్చు. ఇక తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు భారత అమ్మాయిల జట్టు సై అంటోంది.
ముందే దెబ్బ..
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో దేశానికి అత్యధిక పతకాలు తెచ్చిపెట్టిన షూటింగ్‌ను ఈ సారి నిర్వహించకపోవడం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పటివరకూ షూటింగ్‌లో దేశానికి 63 స్వర్ణాలు, 44 రజతాలు, 28 కాంస్యాలు కలిపి మొత్తం 135 పతకాలు వచ్చాయి. అవి అన్ని క్రీడల్లో కలిపితే వచ్చిన పతకాల్లో (503) 25 శాతం కంటే ఎక్కువ కావడం విశేషం. కానీ ఈ సారి షూటింగ్ లేకపోవడంతో పతకాల పట్టికలో భారత్ తొలి అయిదు స్థానాల్లోపు చోటు నిలబెట్టుకుంటుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక జావెలిన్ త్రోలో కచ్చితంగా పతకం గెలుస్తాడనుకున్న నీరజ్ చోప్రా గాయంతో క్రీడలకు దూరమయ్యాడు. మరోవైపు ముగ్గురు అథ్లెట్లపై డోపింగ్ మచ్చ బృందాన్ని ఇబ్బందికి గురిచేసేదే.
కొత్త ఆటలు..
ఈ కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్, 3×3 బాస్కెట్‌బాల్, 3×3 వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్‌ను ప్రవేశపెడుతున్నారు. మొదటి సారి టేబుల్ టెన్నిస్‌లో పారా అథ్లెట్లు తలపడబోతున్నారు. గత క్రీడల్లో మాయమైన జూడో ఈ సారి తిరిగి వచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహణ దిశగా ఇప్పుడీ కామన్వెల్త్‌లో ప్రయోగాత్మకంగా అమ్మాయిల టీ20 టోర్నీ నిర్వహిస్తున్నారు.
పతాకధారి సింధు
కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి.సింధు, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పతాకధారులుగా వ్యవహరించనున్నారు. తొలుత గాయపడి క్రీడలకు దూరమైన నీరజ్ చోప్రా స్థానంలో సింధును పతాకధారిగా భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ప్రకటించింది. అయితే ప్రతి దేశం నుంచి పురుషుల నుంచి ఒకరు, మహిళల నుంచి ఒకరు పతాకధారిగా ఉండాలని నిర్వాహకులు చెప్పడంతో ఐవోఏ మన్‌ప్రీత్ పేరునూ చేర్చింది. గరిష్ఠంగా 164 మందితో కూడిన భారత బృందం ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ సింధు భారత పతాకధారిగా వ్యవహరించింది.
మహిళలకే ఎక్కువ..
ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఈ కామన్వెల్త్ క్రీడలు ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. పురుషుల కంటే ఎక్కువగా మహిళలకు పతకాంశాలు నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ బహుళ క్రీడల పోటీలు ఇవే. అమ్మాయిలకు 136 స్వర్ణాలు అందనుండగా.. పురుషులకు ఆ సంఖ్య 134గా ఉంది. మిక్స్‌డ్ ఈవెంట్లలో మరో పది బంగారు పతకాలున్నాయి. అలాగే సాధారణ క్రీడలతో సమాంతరంగా పారా విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు.