Chiranjeevi latest movie: చిరంజీవి కొత్త సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఒప్పుకోవడంలోనే కాదు, వాటిని పూర్తి చేయడంలోనూ అదే వేగం ప్రదర్శిస్తున్నారు. 'గాడ్‌ఫాదర్' కోసం ముంబయి వెళ్లిన ఆయన సోమవారం రాత్రే హైదరాబాద్‌కి చేరుకున్నారు. మంగళవారం నుంచే బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా కోసం రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో చిరు, ఇతర చిత్రబృందంపై పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళాశంకర్' సినిమా చిత్రీకరణలోనూ ఆయన పాల్గొంటున్నారు. మరోపక్క ఆయన కోసం కొత్త స్క్రిప్టులు సిద్ధమవుతూనే ఉన్నాయి. వెంకీ కుడుముల చిరంజీవి కోసం సామాజికాంశాలతో కూడిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరో రీమేక్ కథ చిరంజీవి కోసమే సిద్ధమవుతోందనేది పరిశ్రమ వర్గాల మాట.