Virat Kohli T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వస్తున్న వార్తలపై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. ఇటీవల ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సిరీస్‌లు, తీరిక లేకుండా మ్యాచులు ఆడాల్సిరావడం వంటి కారణాల దృష్ట్యా ఈ మాజీ కెప్టెన్ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని.. కేవలం వన్డేలు, టెస్టు మ్యాచులకే పరిమితం అవుతాడని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో జోరందుకున్నాయి. విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తాజాగా ఈ అంశంపై వివరణ ఇచ్చాడు.
"ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ విరాట్‌కు చివరిది కాదు. అతడు ఇంకా చాలాకాలం పాటు టీమ్ఇండియాకు ఆడతాడు. అతని ఫామ్, ఫిట్‌నెస్, మ్యాచ్ గెలిపించే పరుగుల దాహం 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తాడు. ఎంతో ప్రతికూలతను అధిగమించి తానేంటో విరాట్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరింత తాజాదనంతో ఆసక్తిగా కనబడుతున్నాడు. ఈ ప్రపంచ టోర్నీ విజయం సాధించడంలో అతడు కీలక పాత్ర పోషిస్తాడని నేను నమ్ముతాను" అని రాజ్‌కుమార్ శర్మ తెలిపాడు.