తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కెప్టెన్సీపై కోహ్లి అబద్దాలు.. ఫిట్​నెస్ కోసం ఇంజెక్షన్లు'.. చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు - బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ కామెంట్స్

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ టీమ్​ ఇండియా ప్లేయర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నాడు. అసలు చేతన్ శర్మ ఏమన్నాడంటే..

chetan sharma
chetan sharma

By

Published : Feb 15, 2023, 6:28 AM IST

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ పెను వివాదంలో చిక్కుకున్నాడు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు టీమ్‌ఇండియా ఆటగాళ్ల గురించి ప్రైవేటు సంభాషణలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక టీవీ ఛానెల్‌ శూల శోధనలో ఈ విషయాలను బయటపెట్టింది. కెప్టెన్సీ విషయంలో విరాట్‌ అబద్ధం చెప్పాడని ఈ సంభాషణలో భాగంగా చేతన్‌ అన్నాడు. పూర్తి ఫిట్‌గా లేని కొందరు టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్‌నెస్‌ ఉన్నట్లు చూపించి మ్యాచ్‌లు ఆడుతారని చేతన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. శూల శోధన చేపట్టిన టీవీ ఛానెల్‌ ప్రకారం చేతన్‌.. బీసీసీఐ, టీమ్‌ఇండియా, భారత ఆటగాళ్ల గురించి ఏమన్నాడంటే..?

భారత క్రికెటర్లు 80 శాతం ఫిట్‌గా ఉన్నా సరే.. ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్‌నెస్‌ సాధిస్తారు. అవి నొప్పి మందులు కావు. డోప్‌ టెస్టుల్లో పట్టుబడని ఉత్ప్రేరకం ఉన్న మందులను వాడతారు. సరైన ప్రదర్శన చేయలేని కొందరు ఆటగాళ్లు కూడా ఈ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకముందే ఈ ఇంజెక్షన్ల సాయంతో మ్యాచ్‌లు ఆడించారు. అతను ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు.

భారత జట్టులో రెండు వర్గాలు ఉన్నాయి. ఓ వర్గాన్ని రోహిత్‌ నడిపిస్తే, మరొకటి కోహ్లి నేతృత్వంలో నడుస్తుంది. అయితే కోహ్లి, రోహిత్‌ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కోహ్లి ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడ్డపుడు రోహిత్‌ అండగా నిలిచాడు. రోహిత్‌, కోహ్లి మధ్య అహం సమస్యగా మారినా.. అది అమితాబ్‌, ధర్మేంధ్ర మధ్య ఉన్నట్లుగానే ఉంటుంది. రోహిత్‌, హార్దిక్‌ నన్ను గుడ్డిగా నమ్ముతారు. ఆ ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. హార్దిక్‌ తరచుగా నన్ను కలుస్తాడు.

కెప్టెన్సీ విషయంలో సెలక్టర్లు ప్రయోగాలు చేయాలనుకున్నారు. అందుకే గత కొన్నేళ్లలో చాలామంది కెప్టెన్లను మార్చి చూశాం. కోహ్లి కెప్టెన్‌గా ఉండగా మాత్రం అతనే మూడు ఫార్మాట్లలోనూ సారథిగా కొనసాగుతాడని మాకు చెప్పారు. కోహ్లిని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలన్నది గంగూలీ నిర్ణయం కాదు. ఉమ్మడిగా తీసుకున్నది. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు ఒకే కెప్టెన్‌ ఉండాలని అనుకుంటున్నట్లు విరాట్‌కు ముందే చెప్పాం. తొలుత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి ప్రకటించినప్పుడు.. మరోసారి ఆలోచించుకోవాలని గంగూలీ చెప్పాడు. సమావేశంలో మేము తొమ్మిది మంది ఉన్నాము. కోహ్లి విన్నాడో లేదో కానీ.. గంగూలీ తనను కొనసాగమని చెప్పలేదని అబద్ధం చెప్పాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అహం దెబ్బ తిని అతను గంగూలీని విలేకరుల సమావేశంలో నిందించాడు. తనపై వేటు పడడానికి గంగూలీనే కారణమని అతను భావించాడు. కోహ్లీకి, గంగూలీకి మధ్య విభేదాలు ఉండేవి. తాను బీసీసీఐ కంటే ఎక్కువ అని విరాట్‌ భావించేవాడు. రవిశాస్త్రి కోచ్‌ కావడంలో అతడిది ముఖ్య పాత్ర.

శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వడం కోసం కోహ్లి, రోహిత్‌ లాంటి పెద్ద స్టార్లకు టీ20 ఫార్మాట్‌ నుంచి విశ్రాంతినిచ్చాం. భవిష్యత్తులో రోహిత్‌ శర్మ టీ20 క్రికెట్‌ ప్రణాళికల్లో ఉండడు. హార్దిక్‌ పాండ్యానే దీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు. సూర్యకుమార్‌, ఇషాన్‌కిషన్‌, దీపక్‌ హుడా, శుభ్‌మన్‌ గిల్‌.. ఇలాంటి 15-20 మంది యువ ఆటగాళ్లను జట్టులోకి నేనే తెచ్చాను. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ల చక్కటి ఫామ్‌ సంజు శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ల భవితవ్యాన్ని ప్రమాదంలో పడేసింది.

వేటు తప్పదా?
చేతన్‌ శర్మ శూల శోధన వ్యవహారం భారత క్రికెట్లో దుమారం రేపేలా కనిపిస్తోంది. బీసీసీఐ ఈ వ్యవహారంపై అధికారికంగా ఏమీ స్పందించకపోయినా.. చేతన్‌పై చర్యలు తప్పవనిపిస్తోంది. గత ఏడాది కాలంలో తన సెలక్షన్‌ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఇటీవల చేతన్‌ చీఫ్‌ సెలక్టర్‌గా మరోమారు అవకాశం దక్కించుకున్నాడు.

నిరుడు టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వైఫల్యం నేపథ్యంలో కమిటీలోని మిగతా సభ్యులందరినీ తప్పించి, ఛైర్మన్‌ అయిన చేతన్‌ను మాత్రం బీసీసీఐ కొనసాగించడం చర్చనీయాంశమైంది. కానీ ఇప్పుడు చేతన్‌ ప్రైవేటు సంభాషణలో టీమ్‌ఇండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు భారత క్రికెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా స్పందించడం ఇబ్బంది కాబట్టి ప్రస్తుతానికి బోర్డు పెద్దలు మౌనం వహిస్తున్నప్పటికీ.. చేతన్‌పై వేటు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details