శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు తొలిసారి బౌలింగ్ చేసేముందు తనకు జీవితమంతా ఒక్కసారిగా కళ్లముందు కదలాడిందని యువ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. ఈ ఏడాది అనూహ్య రీతిలో భారత జట్టుకు ఎంపికైన అతడు తొలి పర్యటనలోనే ఆకట్టుకున్నాడు. తాజాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ అతడికి సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేయగా అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లంకతో తాను తొలి మ్యాచ్ ఆడేటప్పుడు తొలి బంతి వేసేముందు కొద్ది నిమిషాల సమయం దొరికిందని, అప్పుడు తన జీవితంలోని ఆటుపోట్లన్నీ గుర్తొచ్చాయని యువ పేసర్ చెప్పుకొచ్చాడు. మంచి, చెడు, కష్టం, నష్టం, త్యాగాలు, విమర్శలు ఇలా అన్నీ తన కళ్లముందు కదలాడాయని పేర్కొన్నాడు.
"అది నాకు చాలా భావోద్వేగభరితమైన సందర్భం, కానీ.. అదే నాకు స్ఫూర్తి కలిగించింది. అప్పుడే నేను అత్యుత్తమ ప్రదర్శన చేయాలని మనసులో అనుకున్నా. ఇక టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం అనేది నా కల నేరవేరడంలాంటిది. తొలుత ఆ విషయం వినగానే నా మనసులో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి. కానీ, నేను దాన్ని నమ్మేస్థితిలో లేను. అది నిజమా, కాదా అని నన్ను నేనే గిల్లి చూసుకున్నా. ఒకవేళ అదే నిజమైతే తుది జట్టులో ఉంటానా లేదా అనేది కూడా ఆలోచించలేదు. కేవలం ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే చాలనుకున్నా. ఇక శ్రీలంకకు వెళ్లినప్పుడు తొలుత రాహుల్ ద్రవిడ్‌ను చూసి నమ్మలేకపోయా. దిగ్గజ క్రికెటర్ నాతో మాట్లాడి మా కుటుంబం గురించి, నా ఆట గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐపీఎల్‌లో నా బౌలింగ్ చూసి మెచ్చుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి నా ఆటతీరును చూసి అభినందించడం చాలా గొప్పగా అనిపించింది"