Chennai Super Kings: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ 2022 సీజన్‌కు సిద్ధమవుతోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సహా పలువురు ఆటగాళ్లు,సిబ్బంది సూరత్‌లోని ప్రీ సీజన్ క్యాంప్‌కు చేరుకున్నారు. లాల్‌బాయి కాంట్రాక్టర్ స్టేడియంలో 20 రోజుల పాటు సాగే క్యాంప్‌లో ఆటగాళ్లందరూ పాల్గొనాలని యాజమాన్యం కోరింది.
ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మార్చి 26న ప్రారంభమయ్యే టోర్నీలో తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌కతా మధ్య జరగనుంది. ఈ ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో ఆ జట్టు బలాలు, బలహీనతలు ఎంటో ఒకసారి చూద్దాం.
బలాలు:
ప్రధాన ఆటగాళ్ల కొనసాగింపు..
చెన్నై జట్టు తమ ప్రధాన ఆటగాళ్లను కొనసాగిస్తునే ఉండటం వల్ల టీమ్‌లో మార్పులు పెద్దగా ఉండే అవకాశం లేదు. అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, దీపక్ చాహర్‌లను మెగా ఆక్షన్‌లో తిరిగికొనుక్కుంది. ఆటగాళ్ల మధ్య సమన్వయం కుదరించడానికి ఫ్రాంచైజీలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. కానీ చెన్నై జట్టుకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది ఆటగాళ్లు గత కొన్నేళ్లుగా కలిసి ఆడుతున్నారు. ఇది చెన్నై జట్టుకు కచ్చితంగా ప్రయోజనం కలిగించేదే.
కీలక ఆటగాళ్లు..
చెన్నై జట్టు వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు బలాన్నే విశ్వసిస్తుంది. జట్టులోని ప్రధాన ఆటగాడు, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్‌లో 175 పరుగులు, 9 వికెట్లు తీసి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. గత సీజన్లలో అన్ని విభాగాల్లో రాణించిన జడేజా అదే ఉత్సాహంతో ఈసారి ఐపీఎల్లో అడుగుపెడుతున్నాడు. అతడితో పాటు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీపై చెన్నై జట్టు ఆధారపడుతోంది. గత సీజన్లో మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన మొయిన్.. మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆఫ్ స్పిన్నరైన అలీ గత సీజన్లో చాలా తక్కువగా బౌలింగ్ చేశాడు. జడేజా-మొయిన్ ద్వయం ఈ సారి ఐపీఎల్లో కీలక పాత్ర పోషించనుంది.
ఒత్తిడిని జయించే లక్షణం...
ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించడం గొప్ప జట్ల లక్షణం. ఈ విషయంలో చెన్నై జట్టు మొదటివరుసలో ఉంటుంది. ప్రతిసారి ఆ జట్టు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి కొత్త దారులను వెతుక్కుంటుంది. అందుకే చెన్నై ముంబయి ఇండియన్స్ తర్వాత ఐపీఎల్లో విజయవంతమైన ఫ్రాంచైజీగా కొనసాగుతుంది.