Champions Trophy 2025 Host Pakistan :2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులకు సంబంధించి ఐసీసీతో ఒప్పందం కుదిరిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు- పీసీబీ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం పీసీబీ వ్యవహారాలను చూస్తున్న జకా అష్రఫ్ ఈ ఒప్పందంపై సంతకం చేశారని వెల్లడించింది. 'ఐసీసీ ప్రధాన కార్యాలయంలో పాకిస్థాన్‌కు హోస్టింగ్ హక్కులపై ఐసీసీ జనరల్ కౌన్సెల్ జోనాథన్ హాల్ సమక్షంలో పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ జకా అష్రఫ్ సంతకం చేశారు' అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
పాకిస్థాన్ చివరగా 1996 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 2009 ఛాంపియన్స్ ట్రోపీ, 2011 వరల్డ్ కప్ నిర్వహించే ఛాన్స్ వచ్చింది. కానీ 2009లో లాహోర్‌లో శ్రీలంక ప్లేయర్లపై ఉగ్రదడి జరగడం వల్ల భద్రతా కారణాల రీత్యా ఆ రెండు ఈవెంట్లను అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో భారత్ తన జట్టును అక్కడికి పంపిస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయంపై భారత్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఆసియా కప్ నిజానికి పాకిస్థాన్‌లోనే జరగాల్సింది. కానీ భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి వెళ్లలేదు. దీంతో ఇండియా మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.