తెలంగాణ

telangana

ETV Bharat / sports

మూతి పళ్లు రాలినా డోన్ట్​ కేర్​ క్యాచ్ ముఖ్యం కరుణ..!

మైదానంలో ప్రత్యర్థి బాదిన బంతి​ని అందుకునే ప్రయత్నంలో ఓ ప్లేయర్​ మూతి పగిలింది. పళ్లు ఊడి తీవ్రంగా రక్త స్రావమయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతుంది.

Chamika Karunaratne teeth injury
Chamika Karunaratne

By

Published : Dec 8, 2022, 5:20 PM IST

sri lanka premier league 2022: క్రీడలంటే ఆటగాళ్లు ఎంతటి మక్కువ చూపిస్తారో మనకు తెలిసిందే. ఆట కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంటారు. ఆటే ప్రాణంగా కెరీర్​లో ముందుకెళ్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ క్రీడలు ప్రాణాలు మీదకు కూడా వస్తుంటాయి. మైదానంలో ప్లేయర్స్​కు గాయాలు కూడా తగులుతుంటాయి. అయితే సాధారణ విషయమైనప్పటికీ.. కొన్ని సందర్భాల్లో అవి కాస్త గట్టిగానే తగిలి రక్తం కూడా వస్తుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ప్లేయర్​కు ఎదురైంది.

లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కాండీ ఫాల్కన్స్‌, గాలె గ్లాడియేటర్స్‌ టీమ్​ల మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో క్రికెటర్‌ చమిక కరుణరత్నే తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్‌ పట్టుకునే క్రమంలో అతడి మూతికి బలంగా బంతి తాకింది. దీంతో పంటి నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది.

ఇలా జరిగింది.. గాలె గ్లాడియేటర్‌ ఇన్నింగ్స్‌ సమయంలో బ్యాటర్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునేందుకు కరుణరత్నే పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో మరో ఇద్దరు ఫీల్డర్లు రావడాన్ని గమనించిన కరుణరత్నే వారిని వద్దన్నాడు. ఇక క్యాచ్‌ను సులువుగా పట్టుకున్నట్లే అని అనుకుంటున్న దశలో బంతి అతని మూతిపై బలంగా తాకింది. ఆ దెబ్బకు అతని ముందు పళ్లు ఊడివచ్చాయి. అయితే నోటి నుంచి రక్తం కారుతున్నప్పటికి క్యాచ్‌ను మాత్రం వదల్లేదు. ఆ తర్వాత పెవిలియన్‌ వెళ్లి ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గాలే గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్‌ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్‌ వసీమ్‌ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్‌ 44, పాతుమ్‌ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్‌(20) పరుగులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details