ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బ్యాటర్ కోహ్లీ ఆటతీరుపై కొంతకాలంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విమర్శలపై టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ చాహల్ తాజాగా స్పందించాడు. ఇటీవల కోహ్లీ ఎన్నో విలువైన నాక్స్‌తో జట్టుకు మంచి సహకారం అందించాడని చాహల్ అభిప్రాయపడ్డాడు. కానీ, చాలా మంది విరాట్ సెంచరీల గురించి ఆలోచించడం వల్లే ఈ సమస్యంతా వస్తోందని అన్నాడు.
తాజాగా ఓ క్రీడాఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చాహల్.. కోహ్లీ ఆటతీరు గురించి స్పందించాడు. "ఓ ఆటగాడికి టీ20ల్లో 50 కంటే ఎక్కువ సగటు ఉన్నప్పుడు.. రెండు టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పుడు.. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసినప్పుడు.. మనం అతడి సగటు రన్‌రేటు ఎలా ఉందనేది మాత్రమే చూడాలి. కానీ.. కోహ్లీ విషయంలో మనం కేవలం అతడి సెంచరీల గురించే ఆలోచిస్తుండటం వల్లే ఈ సమస్యంతా. ఈ మధ్యకాలంలో జట్టుకు అవసరమైనప్పుడు 60-70 పరుగులతో అనేక విలువైన నాక్‌లు ఆడి మంచి సహకారం అందించాడు. దాని గురించి మనం మాట్లాడట్లేదు" అని చాహల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ క్రీజులో పాతుకుపోతే బౌలింగ్ చేయడానికే చాలా మంది భయపడతారని చాహల్ ఈ సందర్భంగా అన్నాడు. "కోహ్లీ క్రీజులో ఉండి 15-20 పరుగులు చేసిన తర్వాత అతడికి బాల్ వేయడానికి ఏ బౌలర్ ఇష్టపడడు" అని చెప్పుకొచ్చాడు.