Chahal rcb retention : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021(ఐపీఎల్) సీజన్ తర్వాత యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తమ జట్టుతో అట్టిపెట్టుకోలేదు. అప్పుడు బెంగళూరు జట్టుపై విమర్శలు కూడా వచ్చాయి. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆడిన చాహల్‌ను తీసుకోకపోవడం ఏంటి ప్రశ్నించారు. రిటెయిన్ చేసుకోకపోవడమే కాకుండా.. తనను పక్కన పెట్టడానికి గల కారణమేంటో కూడా చాహల్‌కు చెప్పలేదు. దీంతో ఆర్సీబీ విమర్శలు మరింత ఎక్కువగా వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై చాహల్ మాట్లాడాడు.
"2014లో ఆర్సీబీ టీమ్‌తో నా జర్నీ ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్ నుంచి కోహ్లీ నా మీద నమ్మకం ఉంచాడు. నన్ను రిటెయిన్ చేసుకోకపోవడంతో చాలా బాధపడ్డాను. ఎనిమిదేళ్ల పాటు ఆ జట్టు కోసం ఆడాను. కానీ కనీసం కారణం కూడా చెప్పలేదు. అది తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కొంతమంది నేను ఎక్కువగా డబ్బు డిమాండ్ చేసినట్లు మాట్లాడుకున్నారు. అవి విన్నప్పుడు మరింత బాధేసింది. పలు ఇంటర్వ్యూల్లో దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాను. నేను ఎలాంటి ప్రయోజనాలను ఆశించలేదు. నేనెంత పొందడానికి అర్హుడినో నాకు తెలుసు. కానీ అలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా బెంగళూరు జట్టు స్పందించలేదు. కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడలేదు. ఇది మరింత బాధనిచ్చింది. ఇప్పటికీ నన్ను ఎందుకు పక్కనపెట్టిందో కూడా చెప్పలేదు" అని అన్నాడు.
"ఆర్సీబీ ఫ్రాంచైజీ తరఫున 140 మ్యాచులు వరకు ఆడాను. అయితే.. సరైన కారణం చెప్పకుండా, సమాచారం ఇవ్వకుండానే నన్ను పక్కన పెట్టేశారు. రిటెయిన్ చేసుకోలేదు. కానీ వేలంలో మాత్రం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే వేలంలో ఒక్క బిడ్ కూడా వేయలేదు. దీంతో ఆ జట్టుపై విపరీతమైన కోపం వచ్చింది. ఎనిమిదేళ్లు ఆడినా కూడా కనీసం పట్టించుకోలేదు. నాకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే ఎంతో ఇష్టం. జరిగిందేదో జరిగింది. అదంతా మన మంచికే అని భావిస్తున్నాను. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు డెత్‌బౌలర్‌గా మారాను. చివరి ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నాను గతంలో బెంగళూరు జట్టులో ఉన్నప్పుడు చివరిగా 16 లేదా 17వ ఓవర్ బౌలింగ్ చేసేవాడిని. అప్పటికి, ఇప్పటికీ నా ఆట ఇంకాస్త పెరిగింది. దాదాపు 5 నుంచి 10 శాతం పెరిగిందనే చెప్పాలి. అందుకే అప్పుడు జరిగిందంతా నా మంచికే అని భావిస్తున్నాను." అని చాహల్ పేర్కొన్నాడు.