Chahal horrifying experience: రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ తనకు ఎదురైన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధించిన విషయాన్ని చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన వీడియోలో సహచరుడు అశ్విన్‌తో కలిసి తన అనుభవాలను పంచుకున్నాడు. 2013 ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున చాహల్ ఆడుతున్నప్పుడు తన జీవితంలో జరిగిన భయానక సంఘటన గురించి వివరించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ఓ ఆటగాడు ఫుల్‌గా మద్యం తాగి 15వ అంతస్తు నుంచి తనను తలకిందులుగా వేలాడదీశాడని చాహల్ ఈ వీడియోలో తెలిపాడు. అతడి పేరు మాత్రం చాహల్ చెప్పలేదు.
"నేను ఈ సంఘటన గురించి ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు. ఈ రోజు అందరికీ తెలుస్తుంది. 2013వలో నేను ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు బెంగళూరుతో ఒక మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఓ పార్టీ జరిగింది. బాగా తాగిన ఓ ఆటగాడు.. నన్ను బయటికి పిలిచి 15వ అంతస్తుకు తీసుకెళ్లి బాల్కనీ నుంచి వేలాడదీశాడు. అతడి పేరు నేను చెప్పను. ఏం చేయాలో తెలియని నేను అతడి మెడచుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నా. అది గమనించిన కొందరు వచ్చి.. అతడిని ఆపారు. అంతలోనే నేను మూర్ఛపోయా. వారు నాకు వాటర్ ఇచ్చారు. మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలో అప్పుడు అర్థమైంది. కాబట్టి ప్రమాదాన్ని నేను త్రుటిలో తప్పించుకున్నట్లు భావించిన ఒక ఘటన అది. చిన్న పొరపాటు జరిగినా ఆరోజు నేను కిందకి పడిపోయేవాడ్ని."