తెలంగాణ

telangana

ETV Bharat / sports

GT Vs CSK : 'మా ఓటమికి కారణం అదే'.. తప్పు ఒప్పుకున్న ధోనీ! - ఐపీఎల్​ 2023 మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్​కే జట్టు

ఐపీఎల్​ 16వ సీజన్ గుజరాత్​తో జరిగిన ఆరంభ మ్యాచ్​లో చెన్నై జట్టు ఓడిపోయింది. అయితే బ్యాటింగ్​లో జరిగిన చిన్న పొరపాటు వల్లే.. ఓడిపోయామని సీఎస్​కే కెప్టెన్​ ధోనీ చెప్పాడు. మెరుపు ఇన్నింగ్స్​ ఆడి శతకానికి దగ్గరైన రుతురాజ్​​పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంకా ఏమన్నాడంటే?

gt vs csk gt vs csk dhoni speech  ipl 2023
gt vs csk gt vs csk dhoni speech ipl 2023

By

Published : Apr 1, 2023, 8:37 AM IST

Updated : Apr 1, 2023, 9:58 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే బ్యాటింగ్‌లో చేసిన తప్పిదమే తమ ఓటమిని శాసించిందని చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. తేమ ప్రభావం ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్‌లో అదనంగా పరుగులు చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

'డ్యూ ఉంటుందని మా అందరికీ తెలుసు. అయినా మేం బ్యాటింగ్‌లో అదనంగా పరుగులు చేయలేకపోయాం. 15-20 పరుగులు ఎక్కువ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. బంతి సరిగ్గా టైమ్ చేశాడు. అతని బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంది. అతడు ఆడిన విధానం, ఎంచుకున్న షాట్లు ఆకట్టుకున్నాయి. రుతురాజ్‌లా యువ ఆటగాళ్లు సత్తా చాటడం చాలా ముఖ్యం. హంగార్గేకర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అతను ఇంకా రాటుదేలాల్సి ఉంది. టోర్నీ జరుగుతున్నా కొద్దీ అతనే మెరుగవుతాడు. మా బౌలర్లు కొన్ని తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నోబాల్స్ వేయడం తగ్గించాలి. ఎందుకంటే నోబాల్స్ వేయడం మన చేతుల్లోనే ఉంటుంది. ఏది ఏమైనా మా బౌలర్ల ప్రదర్శన ఈ రోజు బాగానే ఉంది. ఇద్దరు లెఫ్టార్మర్స్ ఉండటం బెటర్ ఆప్షన్ అనుకున్నా. అందుకే ఇద్దర్నీ తీసుకున్నా. శివమ్ ధూబే రూపంలో ఆప్షన్ ఉన్నా.. అతనికి బౌలింగ్ ఇవ్వాల్సిన అవసరం కనిపించలేదు' అంటూ ధోనీ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92) ఒక్కడే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో ధోనీ(14 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా.. జోష్ లిటిల్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం గుజరాత్​ టైటాన్స్​ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. రషీద్ ఖాన్(10 నాటౌట్), రాహుల్ తెవాటియా(15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. చెన్నై బౌలర్లలో హంగార్గేక్కర్ మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, జడేజా తలో వికెట్ పడగొట్టారు.

Last Updated : Apr 1, 2023, 9:58 AM IST

ABOUT THE AUTHOR

...view details