Case Filed On Australia Player Mitchell Marsh :ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే కప్పు తీసుకున్నాక ఆసీస్ ప్లేయర్లందరూ ఉత్సాహంగా ట్రోఫీతో ఫొటోలు దిగారు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి కప్పును తీసుకెళ్లాక.. ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్ దానిపై కాళ్లు వేసి అభ్యంతరకరంగా ఫొటోలు దిగాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. భారత క్రికెట్ అభిమానులు మార్ష్ చర్యపై దుమ్మెత్తిపోశారు. వరల్డ్ కప్‌ను ఎలా గౌరవించాలో మార్ష్‌కు తెలియదంటూ.. భారత ప్లేయర్లను చూసి నేర్చుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మిచెల్ మార్ష్‌పై కేసు నమోదైంది. మార్ష్.. వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ అలీగఢ్‌కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టిఐ కార్యకర్త దిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించాడు. కేశవ్ ఫిర్యాదును స్వీకరించిన దిల్లీ గేట్ పోలీసులు.. మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మిచెల్ మార్ష్ చర్య ప్రతిష్టాత్మకమైన ట్రోఫీకే కాకుండా 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని.. భారతీయులకు అవమానం కలిగించిందని ఫిర్యాదులో ఆరోపించాడు. కేశవ్.. ఫిర్యాదు కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు కూడా పంపించాడు. మిచెల్ మార్ష్ ఇండియాలో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఆడకుండా, విదేశాల్లోనూ టీమ్ఇండియాతో ఆడకుండా జీవితకాలం పాటు నిషేధించాలని కేశవ్ డిమాండ్ చేశాడు.