తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందుకే నేను కెప్టెన్‌ అవ్వలేకపోయా: స్పష్టతనిచ్చిన యువీ - yuvaraj singh greg chapell

Yuvaraj singh Captain: టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు మాజీ ప్లేయర్​ యువరాజ్ సింగ్​. అయితే అలాంటి ఆటగాడు కెప్టెన్సీ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. తాజాగా తాను ఎందుకు సారథి కాలేకపోయాడో వివరించాడు యువీ. అదేంటంటే..

yuvaraj singh captaincy
యువరాజ్ సింగ్ కెప్టెన్సీ

By

Published : May 8, 2022, 11:50 AM IST

Yuvaraj singh Captain: భారత క్రికెట్‌ చరిత్రలో యువరాజ్‌సింగ్‌ ప్రత్యేకమైన ఆటగాడు. టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడు కెప్టెన్సీ చేపట్టకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే అంశమే. అయితే, తాను 2007లోనే సారథ్య బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేకపోయిందని తాజాగా వెల్లడించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. గ్రేగ్‌ ఛాపెల్‌ కోచ్‌గా ఉన్న సమయంలో జరిగిన కొన్ని కీలక విషయాలనూ బయటపెట్టాడు.

"టీమ్‌ఇండియాకు అప్పుడు నేను కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. అదే సమయంలో గ్రేగ్‌ ఛాపెల్‌ వివాదం చోటుచేసుకుంది. అప్పుడు సచిన్‌, ఛాపెల్‌ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో నేను సచిన్‌వైపే మొగ్గు చూపా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్‌ చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. అయితే.. అదెంతవరకు నిజమో నాకు తెలియదు. అప్పటికి వైస్‌ కెప్టెన్‌గా ఉన్న నన్ను ఉన్నట్టుండి తొలగించారు. 2007 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు మేం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లాం. అప్పుడు సెహ్వాగ్‌ జట్టులో లేడు. నేను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నా. ద్రవిడ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో నేనే కెప్టెన్‌ అవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అది నాకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం. అయినా, ఆ విషయంలో నేనెప్పుడూ బాధపడలేదు. అయితే, కొద్ది రోజుల తర్వాత ధోనీ కెప్టెన్సీ బాగా చేస్తున్నాడని అర్థం చేసుకున్నా. వన్డేల్లోనూ అతడే నాయకత్వం వహించాలని భావించా. అతడే సరైన నాయకుడని అనుకున్నా. తర్వాత నేను వరుసగా గాయాలపాలయ్యాను. దీంతో ఒకవేళ నన్ను కెప్టెన్‌గా చేసినా ఎక్కువ కాలం కొనసాగనని అనుకున్నా. ఏదైనా మన మంచికే జరుగుతుంది. అయితే, టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించడం చాలా గొప్ప విషయంగా భావిస్తా. నేనెప్పుడూ జట్టు కోసమే ఆలోచిస్తా. అందుకే సచిన్‌కు మద్దతిచ్చా" అని స్పష్టం చేశాడు.

కాగా, సచిన్‌ తన 'బిలియన్‌ డ్రీమ్స్‌' బయోపిక్‌లో ఛాపెల్‌తో జరిగిన వివాదం గురించి స్పష్టతనిచ్చాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ జరగడానికి నెల రోజుల ముందు ఛాపెల్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలను చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు వ్యతిరేకించారని చెప్పాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏవేవో మార్పులు చేయడం తమకు నచ్చలేదని తెలిపాడు. అతడు తీసుకున్న నిర్ణయాల వల్ల జట్టు ఇబ్బందులు పడిందని గుర్తుచేసుకున్నాడు.

ఇదీ చూడండి: 'ఆ నిర్ణయం సరికాదు.. సచిన్‌ను 200 కొట్టనివ్వాల్సింది'

ABOUT THE AUTHOR

...view details