captain Rohithsharma on pant: పూరన్ రనౌట్ విషయంలో పంత్ ప్రవర్తన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం తెప్పించింది. కానీ వెంటనే ఓ నవ్వుతో ఆ కోపాన్ని కవర్ చేశాడు.
అసలేం జరిగిందంటే... విండీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో నికోలస్ పూరన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ రనౌట్ చేసింది పంత్. అయితే రనౌట్‌కు ముందు ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కవర్ పాయింట్ దిశగా ఆడిన పూరన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కైల్ మేయర్స్ వద్దని వారించిన వినకుండా ముందుకు పరిగెత్తాడు. అప్పటికే మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న సంజూ శాంసన్ వేగంగా పరిగెత్తుకొచ్చి పంత్‌కు క్విక్ త్రో వేశాడు. బంతిని అందుకున్న పంత్.. వికెట్లను గిరాటేయకుండా సమయాన్ని వృథా చేశాడు. అయితే పూరన్ అప్పటికే సగం క్రీజు దాటి మళ్లీ వెనక్కి వచ్చినా తాను క్లియర్ రనౌట్ అవుతానని తెలిసి ఆగిపోయాడు. ఆ తర్వాత పంత్ బెయిల్స్ ఎగురగొట్టాడు. అయితే ఇదంతా గమనించిన రోహిత్.. పంత్ దగ్గరకు వచ్చి..''సమయం ఎందుకు వృథా చేస్తున్నావ్.. బంతి దొరికిన వెంటనే బెయిల్స్ పడగొట్టొచ్చుగా'' అంటూ కోపాన్ని ప్రదర్శించాడు. అయితే తర్వాత కూల్ అయిన రోహిత్.. నవ్వుతూ పంత్‌ను హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.