Cape Town Test: టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు సంసిద్ధమవుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కోహ్లీ.. ప్రస్తుతం నెట్ ప్రాక్టీస్‌లో చురుగ్గా ఉన్న ఫొటోని బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. కేప్‌టౌన్ చేరుకున్న భారత జట్టు ఆటగాళ్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో నెట్ ప్రాక్టీస్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు కూడా షేర్ చేసింది బీసీసీఐ.
"మూడో టెస్టు నేపథ్యంలో టీమ్ఇండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. కేప్‌టౌన్‌లో ఆటగాళ్లంతా సిరీస్ నెగ్గాలనే ధీమాతో కసరత్తులు చేస్తున్నారు." అని బీసీసీఐ షేర్ చేసిన ఫొటోలకు కాప్షన్ జోడించింది.
విహారి ఔట్..
విరాట్ కోహ్లీ మూడో టెస్టులో అందుబాటులోకి వస్తే.. హనుమ విహారికి విశ్రాంతి లభించనుంది. అయితే.. రెండో టెస్టు తర్వాత విరాట్ రాకపై క్లారిటీ ఇచ్చాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. కోహ్లీ కోలుకుంటున్నాడని చివరి టెస్టులో తప్పకుండా ఆడుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
అయితే.. టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ టెస్టుకు దూరంకానున్నాడు. అతడి స్థానంలో ఇషాంత్ శర్మ ఆడనున్నట్లు సమాచారం.