ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. రాహుల్ పరుగులు చేసి తీరాలని పేర్కొన్నాడు. అతడు మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచకూడదని వ్యాఖ్యానించాడు. "భారత్ టాప్ ఆర్డర్ ఆటతీరులో కొంత నిలకడ రావాల్సి ఉంది. కేఎల్ రాహుల్ పరుగులు సాధిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మిడల్ ఆర్డర్‌పై ఒత్తిడి కొనసాగించలేరు" అని ఐసీసీ ది బిగ్ టైం ప్రివ్యూలో వ్యాఖ్యానించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై మాట్లాడుతూ.. అతడు ఈ ప్రపంచకప్‌లో వెలిగిపోతున్నాడని మెచ్చుకున్నాడు. 10 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించని షాట్లను కూడా సూర్యా ఆడుతున్నాడని ప్రశంసించాడు. అతడొక అద్భుతమైన ఆటగాడన్నాడు.
ఈ ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ దారుణంగా ఉంది. అతడు మూడు మ్యాచుల్లో ఓపెనర్‌గా కేవలం 22 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి సగటు 7.33. ఒక్క మ్యాచ్‌లో కూడా రెండంకెల స్కోర్‌ను కూడా అందుకోలేదు. వరుసగా 4,9,9 అతడు సాధించిన స్కోర్లు. అయితే కొన్ని ఇన్నింగ్స్‌ల్లో విఫలమైనంత మాత్రాన రాహుల్ లాంటి నాణ్యమైన బ్యాటర్‌ను పక్కన పెట్టలేమని కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ రోహిత్‌తో కలిసి రాహులే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడని అతడు స్పష్టం చేశాడు.