Bumrah World Cup Powerplay:టీమ్ఇండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. గత కొన్నేళ్లుగా భారత జట్టు బౌలింగ్ దళంలో కీలకంగా కొనసాగుతున్నాడు. గుడ్ లైన్ అండ్ లెంగ్త్‌తో పర్ఫెక్ట్ యార్కర్లు సంధించే బుమ్రా.. కొద్ది కాలంలోనే యార్కర్ కింగ్‌గా పేరొందాడు. ఇక టీమ్ఇండియాకు పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బుమ్రా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వెన్నునొప్పి గాయంతో దాదాపు ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన బుమ్రా.. మళ్లీ పాత లయను దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ రాణిస్తూ.. టీమ్ఇండియాకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ఈ క్రమంలోనే బుమ్రా కొన్ని కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేస్తున్నాడు.
అక్టోబర్ 22 ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా.. తొలి పవర్ ప్లేలో నాలుగు ఓవర్ల బౌలింగ్ చేశాడు. ఈ స్పెల్‌లో అతడు కివీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు. కేవలం 2.75 ఎకనమీతో 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ మొత్తంలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. 45 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇందులో ఓ మెయిడెన్ ఓవర్ కూడా ఉంది.
బుమ్రా తన వన్డే వరల్డ్‌కప్ కెరీర్లో తొలి పవర్ ప్లే (1-10 ఓవర్లు)లో 330 బంతుల్ని సంధించాడు. ఇందులో ఏకంగా 253 బంతులు డాట్‌బాల్స్ అయ్యాయి. ఇందులో 162 పరుగులిచ్చి.. మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. అంటే సగటున 23 పరుగులుకు ఓ వికెట్ తీసినట్టు.