తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియాకు గుడ్​న్యూస్​.. వరల్డ్‌కప్​ ముందు బిగ్‌బూస్ట్‌!.. బీసీసీఐ కీలక ప్రకటన

టీమ్​ఇండియా ప్లేయర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌ గురించి బీసీసీఐ కీలక అప్‌డేట్‌ అందించింది. బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని తెలిపిన బీసీసీఐ.. శ్రేయస్​కు వచ్చేవారం సర్జరీ జరుగుతుందని తెలిపింది.

Bumrah undergoes successful surgery Shreyas scheduled for surgery next week
Bumrah undergoes successful surgery Shreyas scheduled for surgery next week

By

Published : Apr 15, 2023, 6:20 PM IST

భారత క్రికెట్​ జట్టు స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ల ఫిట్‌నెస్​కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక అప్‌డేట్‌ అందించింది. బుమ్రాకు సర్జరీ విజయవంతంగా పూర్తైందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ స్పీడ్‌స్టర్‌ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. శ్రేయస్‌ అయ్యర్‌కు వచ్చే వారం సర్జరీ జరుగనుందని పేర్కొంది. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్‌ రెండు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడని.. తర్వాతే జాతీయ క్రికెట్‌ అకాడమీకి వస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

"వెన్ను దిగువ భాగంలో తీవ్రనొప్పితో అల్లాడుతున్న జస్‌ప్రీత్‌ బుమ్రాకు న్యూజిలాండ్‌లో సర్జరీ జరిగింది. అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. స్పెషలిస్టుల సూచన మేరకు ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఆరు వారాల పాటు రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉండనున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ మొదలుపెడతాడు. మిస్టర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు వచ్చే వారం సర్జరీ జరుగనుంది. సర్జరీ పూర్తైన తర్వాత అతడు ఎన్‌సీఏకు చేరుకుంటాడు" అని బీసీసీఐ తెలిపింది. కాగా బుమ్రాలా అయ్యర్‌ కూడా పూర్తిగా కోలుకుంటే టీమ్​ఇండియా మరింత పటిష్టమవుతుంది.

అయితే అక్టోబర్​లో ఆరంభమయ్యే ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​నకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్లేయర్లకు సర్జరీలు కావడం ఆందోళన కలిగిస్తోంది. నెలల పాటు సమయం ఉన్నా.. ఈ ప్లేయర్లు పూర్తిగా కోలుకుని టెస్టు మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్​ల్లో మళ్లీ గాయం అయితే.. వరల్డ్​ కప్​నకు దూరంగా ఉండాల్సిందే. ఈ మధ్య సమయంలో కొత్త వారికి ఏవైనా గాయాలైతే.. వీరు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే బుమ్రా లాంటి స్టార్​ ప్లేయర్​ లేని లోటు.. గతేడాది జరిగిన టీ20 వరల్ట్​ కప్​లో స్పష్టంగా కనిపించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ప్రణాళిక రూపొందిచాల్సిన అవసరం ఉంది. తాజా సమాచారం ప్రకారం వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ వరకు బుమ్రా జట్టుతో చేరనున్నాడని వెల్లడైంది. మరోవైపు.. అయ్యర్‌ సైతం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైనప్పటికీ ప్రపంచకప్‌ టోర్నీకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జస్​ప్రీత్​ బుమ్రాకు గతేడాది ఆసియా కప్​ సమయంలో నడుము కింద భాగంలో గాయం అయింది. మొదటి చిన్న గాయం అని అనుకున్నారు. అనంతరం వరల్డ్ కప్​ టీ20 స్క్వాడ్​లోకి కూడా తీసుకున్నారు. కానీ తర్వాత అది సీరియస్​ ఇంజ్యురీ అని తెలిసింది. దీంతో టీ20 వరల్డ్​ కప్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత కూడా ఆతడిపై ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని భావించిన బీసీసీఐ.. ఎన్​సీఏకే పరిమితం చేసింది. గతేడాది బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన తర్వాత శ్రేయస్​ అయ్యర్​ మొదటిసారి వెన్నులో అసౌకర్యాన్ని అనుభవించాడు. బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత గాయం తీవ్రమవ్వడంతో సర్జరీకి సిద్ధమయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details