Brathwaite News: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ తండ్రి అయ్యాడు. అతడి భార్య, ఈనెల 6న ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇతడు ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. తమ కుమార్తెకు కోల్‌కతాలోని క్రికెట్ మైదానం 'ఈడెన్ గార్డెన్స్'లో ఈడెన్‌ను తీసుకుని 'ఈడెన్ రోజ్' అని పేరు పెట్టినట్లు చెప్పాడు. ఆమెతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పేరు పెట్టడానికి గల కారణాన్ని తెలిపాడు.
2016 ప్రపంచకప్ ఫైనల్‌లో ఈడెన్ గార్డెన్స్‌లోనే నాలుగు సిక్సులు కొట్టి తమ జట్టుకు ప్రపంచకప్ అందించాడు బ్రాత్‌వైట్. ఈడెన్ గార్డెన్స్.. తనకు పేరు తెచ్చిందని అందుకే తమ చిన్నారి పేరులో ఈడెన్ అని చేర్చినట్లు చెప్పాడు.
"ఈడెన్ రోజ్ బ్రాత్‌వైట్ పేరును గుర్తుంచుకో. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తానని నాన్న వాగ్దానం చేశాడు. ధన్యవాదాలు జెస్సీ. నువ్వు దృఢంగా ఉన్నావ్.. అలాగే ఉంటావు కూడా. నువ్వు అద్భుతమైన తల్లి అవుతావని నాకు తెలుసు. మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను" అని వైట్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.