బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్‌కు ఉన్న వైస్ కెప్టెన్ ట్యాగ్‌ను తొలిగించి క్రికెట్ ప్రేమికులకు షాక్ ఇచ్చింది. అలానే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించిన బోర్డు.. వైస్ కెప్టెన్‌గా రాహుల్ స్థానంలో హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది. అయితే తొలి రెండు టెస్టుల్లో మంచి ప్రదర్శన చేయడంలో విఫలమైన కేఎల్ రాహుల్‌ను.. మూడో టెస్టుకు పక్కనపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి బదులుగా తుది జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
"బోర్డుతో పాటు టీమ్ మేనెజ్మెంట్ ఎప్పుడూ రాహుల్‌కు మద్దతుగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ గతంలో విదేశీ టెస్టుల్లో బాగా ఆడినప్పటికీ.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ప్రస్తుతం అతడికి యంగ్ ప్లేయర్స్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. అయితే తొలి రెండు టెస్టుల్లో టీమ్ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో అతడిని మిగిలిన రెండు టెస్టులకు కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లేదంటే జట్టులో మార్పులు చాడాల్సి వచ్చేది. అయితే ఇండోర్‌లో జరగబోయే టెస్టుకు శుభమన్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది" అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.