బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా టీమ్ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. టీమ్ఇండియా కన్నా 62 పరుగుల అధిక్యంలో నిలిచింది. ట్రావిస్ 39, లబుషేన్ 16 క్రీజులో ఉన్నారు. జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.
కాగా, రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(6) ఆరో ఓవర్‌లోనే స్పిన్నర్ రవీంద్ర జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్స్‌తో 81 పరుగులు చేసిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. అయితే అది బోల్తా కొట్టింది. స్వీప్ ఆడిన ఖవాజా ఫీల్డర్ శ్రేయస్ అయ్యర్ చేతికి దొరికి వెనుదిరిగాడు. ఇకపోతే ట్రావిస్ హెడ్.. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్నాడు. మరి అతడిని ఆదివారం తొలి సెషన్‌లో భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి.