దాదాపు ఐదు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రవీంద్ర జడేజా మంచి ప్రదర్శన కనబరిచాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో తన మ్యాజిక్‌తో ఐదు వికెట్లు పడగొట్టాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్స్‌కోబ్, టాడ్ మార్ఫేను పెవిలియన్ పంపించి ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. టెస్టుల్లో అతడు ఐదు వికెట్ల హాల్ అందుకోవడం ఇది 11వ సారి కావడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు ముగిసేసరికి 120/5 స్కోరుతో ఉంది. అప్పటికే జడేజా మూడు వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. ఈ క్రమంలో 46వ ఓవర్‌ను జడేజా వేశాడు. ఈ ఓవర్ ప్రారంభానికి ముందు జడ్డూ బంతిని అందుకుని సిరాజ్ దగ్గరికి వెళ్లాడు. అతడి దగ్గరి ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్ చేసే వేలికి రాసుకున్నాడు.