బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభించాడు. ఏకంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. 174/8తో మొదటి రోజు చివరి సెషన్ ఆరంభించిన కంగారూల జట్టు మరో మూడు పరుగులు జోడించి చివరి రెండు వికెట్లను కోల్పోయింది. కాగా, టెస్టుల్లో జడేజా ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది 11వ సారి. ఇక, అశ్విన్ మూడు, సిరాజ్, షమి తలో వికెట్ పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా బ్యాటింగ్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
ధోనీని గుర్తుచేసేలా.. ఇక ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అరంగేట్ర టెస్టులోనే తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో క్రికెట్ ప్రేమికుల్ని. అద్భుతమైన స్టంపౌట్‌తో మెరిశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను మెరుపు వేగంతో స్టంప్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 36 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో ఐదో బంతికి లబుషేన్ ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి కవర్‌డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ భరత్ చేతికి వెళ్లింది. బంతిని అందుకున్న భరత్ రెప్పపాటు వేగంలోనే బెయిల్స్‌ను పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అప్పుడు థర్డ్ అంపైర్.. లబుషేన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనిని భరత్ గుర్తుచేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.