Border Gavaskar Trophy 2023 : భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్ సొంతం చేసుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలని కోరుకుంటోంది. మొదటి మూడు టెస్టు మ్యాచ్‌లు జరిగిన మైదానాలు స్పిన్నర్లకు అనుకూలించగా.. నాలుగో టెస్టుకు వేదికైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటర్లకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా సీనియర్ బ్యాటర్ల వైఫల్యం భారత జట్టును కలవరపెడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 207 పరుగులతో ఈ టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా తరఫున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్.. స్థాయికి తగ్గట్లు సత్తా చాటాల్సి ఉంది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గత మూడున్నరేళ్లుగా టెస్టుల్లో కోహ్లీ సగటు కేవలం 25 కు పైనే ఉంది. ఛెతేశ్వర్ పుజారా కూడా మొదటి మూడు టెస్టుల్లో చేసింది 98 పరుగులు మాత్రమే. మరోవైపు కీపింగ్‌లో రాణిస్తున్న కేఎస్ భరత్ బ్యాటర్‌గా తన సత్తా చాటలేకపోతున్నాడు. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం.. కేఎస్ భరత్‌కు మద్దతుగా నిలిచాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ సత్తా చాటుతుండగా..అక్షర్ పటేల్ బంతితో కంటే బ్యాట్‌తోనే ఎక్కువగా రాణిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 185 పరుగులు చేసి భారత్ తరఫున రెండో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. సొంత రాష్ట్రంలో అక్షర్ పటేల్ బంతితోనూ సత్తా చాటాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. పేస్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ స్థానంలో మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వన్డే సిరీస్ నేపథ్యంలో సిరాజ్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తున్నారు. మరోవైపు తొలి రెండు టెస్టులు ఓడినప్పటికీ.. మూడో టెస్టులో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా టీమ్.. చివరి మ్యాచ్‌లోనూ సత్తా చాటి సిరీస్‌ను సమం చేయాలని కోరుకుంటోంది.