డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్, ర్యాంకింగ్స్‌లో మొదటి ప్లేస్.. ఈ రెండు కీలక అంశాలను తేల్చే బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం (జనవరి 9) నాగ్‌పూర్‌లో తొలి టెస్టు మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా తుది కూర్పు ఇలా ఉండొచ్చు అని వార్తలొస్తున్నాయి. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం కంగారూలను ఢీకొట్టే 11 మంది భారతీయులు వీరే కావొచ్చు.
టీమ్ ఇండియా ఫైనల్ 11 గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే.. ఏడు ప్లేస్‌ల గురించి అంతా ఓకే.. నాలుగు స్థానాల మీదే చర్చ నడుస్తోంది. ఆ స్థానాల కోసం పోటీలో ఉన్నది శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, కె.ఎస్.భరత్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్. వీరిలో ముగ్గురు తుది జట్టులో ఉంటారు. అయితే వాళ్లెవరూ అనేదే ఇక్కడ చర్చ. రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌కు చోటు పక్కా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ల గత ఆటతీరు, ఫామ్, రికార్డులు.. ఇలా ఏవి చూసుకున్నా.. వీళ్ల ప్లేస్ గురించి ఆలోచనే అవసరం లేదు. జడేజా గత కొన్ని నెలలుగా గాయం కారణంగా దూరంగా ఉన్నా.. ఇటీవల రంజీలో దుమ్మురేపి జట్టులోకి వచ్చాడు.
స్పిన్నర్ ఎవరు.. కీపర్ ఎవరు..
పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాల్లో తొలుత మూడో స్పిన్నర్ సంగతి చూద్దాం. టెస్టులు, అందులోనూ భారత్‌లో టెస్టులు అంటే మూడో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్‌కి ఓటేస్తారు చాలామంది. అయితే అక్షర్ కంటే కుల్‌దీప్ యాదవ్ అయితే బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. జడేజా, అక్షర్ బౌలింగ్ స్టయిల్ కాస్త దగ్గరదగ్గరగా ఉంటాయని.. అందుకే వైవిధ్యం కోసం కుల్‌దీప్‌కు చోటివ్వాలని మాజీలు సూచిస్తున్నారు. ఎలాంటి పిచ్ మీదనైనా బంతిని తిప్పేయడం అక్షర్ కంటే కుల్‌దీప్‌కే సాధ్యం అనేది చర్చ. అయితే బ్యాటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే అక్షర్‌కే ఎక్కువ మార్కులు పడతాయి.
రెండో చర్చనీయాంశం.. కీపర్. రిషబ్ పంత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో రేసులోకి కె.ఎస్.భరత్, ఇషాన్ కిషన్ వచ్చారు. పంత్ స్టైల్ అగ్రెసివ్ బ్యాటింగ్, కీపింగ్ కావాలి అనుకుంటే ఇషాన్‌ని మించిన ఆప్షన్ లేదు. అయితే రంజీ గేమ్స్‌లో ప్రదర్శన భరత్‌కు పాజిటివ్‌గా మారింది. ఇటు బ్యాటింగ్‌లోను, అటు కీపింగ్‌లోనూ అదరగొట్టడం.. జట్టులో చాలా రోజులు బెంచ్ మీద ఉండటం లాంటి అంశాలు భరత్‌కు కలిసొస్తాయి అంటున్నారు పరిశీలకులు.