బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2023తో టీమ్ఇండియా టెస్టు క్రికెట్‌లోకి తెలుగు కుర్రాడు, యంగ్ క్రికెటర్ కేఎస్ భరత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్-భారత్ మధ్య జరిగిన మూడు టెస్టుల్లోనూ అతడికి తుది జట్టులో చోటు దక్కింది. కానీ అతడు ఏ ఒక్క మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి టెస్టులో 8, రెండో టెస్టులో 6, 23*, మూడో టెస్టు 17, 3 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో భరత్.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురయ్యాడు. అయితే ఇండోర్ వేదిక జరిగిన మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోర పరాజయం అందుకున్న తర్వాత కూడా అతడు ట్రోల్ అవుతూనే ఉన్నాడు. కొంతమంది నెటిజన్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మరి కొంతమంది నెటిజన్లు అతడికి మద్దతు ఇస్తున్నారు. ఈ ట్రోల్స్ చేస్తున్నవారంతా సిరీస్ ఎలా జరుగుతుందో పెద్దగా గమనించట్లేదని.. అందుకే భరత్‌పైనే మాత్రమే ట్రోల్ చేస్తూ వస్తున్నారని.. మద్దతు ఇచ్చే వాళ్లు అంటున్నారు.
విషయానికొస్తే.. ఈ నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలి, ఐసీసీ నెం.1టెస్ట్ టీమ్‌గా అవతరించాలనే లక్ష్యంతో టీమ్ఇండియా ఈ సిరీస్ బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే అన్ని మ్యాచ్‌లకు బంతి ఎక్కువగా గింగరాలు తిరిగేలా స్పిన్ పిచ్‌లను తయారు చేయించింది. అలానే తొలి రెండు టెస్టుల్లో మంచి విజయం సాధించింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, మూడో టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు విజయం దక్కలేదు. తమ ప్లాన్ రివర్స్ కొట్టింది. ఎందుకంటే స్పిన్నర్లు మన టీమ్‌లోనే కాదు ప్రత్యర్థి జట్టులోనూ నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, కుహ్నేమన్ లాంటి ప్రతిభ ఉన్న స్పిన్నర్లు ఉన్నారు.