గతేడాది కరోనా వైరస్ విజృంభణతో దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నా ఇంకా చాలా మంది పొట్టకూటికి తిప్పలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు ఆశతో రోజులు వెళ్లదీస్తున్నారు. అలాంటి వారిలో టీమ్‌ఇండియా క్రికెటర్ కూడా ఉన్నాడు. ఆయనే నరేశ్ తుమ్డా (Naresh Tumda). 2018 అంధుల ప్రపంచకప్ ఫైనల్స్‌లో (Blind Cricket World Cup) పాకిస్థాన్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇప్పుడు బతుకుదెరువు కోసం రోజూ కూలీగా మారాడు.
Naresh Tumda: ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్.. ప్రస్తుతం కూలీగా - blind wc winner
టీమ్ఇండియాకు గతంలో ప్రపంచకప్ అందించిన ఆ క్రికెటర్ ప్రస్తుతం రోజు గడవక కూలీ పని చేసుకుంటున్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? తన దీనగాథ ఏంటి?
నరేశ్ గుజరాత్‌కు చెందిన ఓ బ్లైండ్ క్రికెటర్. చిన్నవయసు నుంచే ఆటపై ఆసక్తి చూపడం వల్ల 2014లో ఆ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే 2018లో షార్జాలో జరిగిన బ్లైండ్ క్రికెటర్స్ ప్రపంచకప్‌లో ఆడాడు. అప్పుడు టీమ్‌ఇండియా పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించడంలో నరేశ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటీ అవకాశం రాలేదని తెలిపాడు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్ సమయంలో కూరగాయలు అమ్మినట్లు పేర్కొన్నాడు. అందులోనూ సరైనా ఆదాయం లభించలేదు. దీంతో ఇప్పుడు రోజు కూలీగా మారానన్నాడు. ప్రస్తుతం రోజుకు రూ.250 చొప్పున సంపాదిస్తున్నానని పేర్కొన్నాడు. ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని తనకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని నరేశ్ కోరుతున్నాడు. తన తల్లిదండ్రులు పనులు చేసే స్థితిలో లేరన్నాడు. తానే కుటుంబ పోషణ చూసుకోవాల్సిందని నరేశ్ మీడియాతో తన బాధను పంచుకున్నాడు.
ఇదీ చదవండి:ద్రవిడ్.. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ అవుతారా?