బయోబబుల్‌లో నిర్విరామంగా గడపడం వల్ల ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పాకిస్థాన్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Muhammed Rizwan) అభిప్రాయపడ్డాడు. అందుకే టీ20 ప్రపంచకప్‌నకు ముందు క్రికెటర్లకు కాస్త విశ్రాంతినివ్వాలని సూచించాడు.
"బయోబబుల్‌లో ఎక్కువ రోజులు గడపడం చాలా కష్టం. గతేడాది కాలంగా మేము చాలా క్రికెట్ ఆడాం. ఇది మాకు మంచిదే అయినప్పటికీ అదే సమయంలో ప్లేయర్లు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు."
-రిజ్వాన్, పాకిస్థాన్ క్రికెటర్.
యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. దీనికి ముందు సీనియర్ ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారని రిజ్వాన్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కెప్టెన్ బాబర్ అజామ్, రిజ్వాన్, ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా ఆఫ్రిది, హసన్ అలీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీమ్ చర్చించినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వన్డే సిరీస్‌కు సంబంధించి ఈ వారంలో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. ఒకవేళ ఈ నలుగురు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటే.. ఓ సిరీస్‌కు అధిక సంఖ్యలో సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండడం పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.
ఇదీ చదవండి:ఒకే ఇన్నింగ్స్‌లో త్రిమూర్తుల శతకాలు..